నాల్గోసెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ పేపర్ బయటికి వచ్చిందన్న వార్తలతో కలకలం
బోధన్‌లో జవాబులను జిరాక్సు తీసినట్లు అనుమానాలు
నిజమని తేలితే కఠినచర్యలు : టీయూ పరీక్షల నియంత్రణాధికారి
శక్కర్‌నగర్/డిచ్పల్లి, ఆగస్టు 14: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్ష ప్రశ్న పత్రం శనివారం నిర్వహణకు ముందే ఓ సెంటర్ నుంచి లీక్ అయినట్లు వచ్చి వార్తలు కలకలం సృష్టించాయి. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఓ పరీక్షా కేంద్రం నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ప్రశ్న పత్రాన్ని లీక్ చేసినట్లు సమాచారం. ప్రశ్నపత్రం లీక్ చేస్తే సదరు సెంటర్‌కు చెందిన కోడ్ ఉంటుందనే ఉద్దేశంతో సదరు కళాశాల వారు కేవలం ప్రశ్నలను మాత్రమే జిరాక్స్ సెంటర్‌కు అందచేసినట్లు తెలుస్తోంది. డిగ్రీ పరీక్షల నిర్వహణకు బోధన్‌లో ఐదు సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఓ కళాశాల నుంచి ప్రశ్నలు లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షల సందర్భంగా జిరాక్స్ సెంటర్లు మూసివేయాల్సి ఉండగా, అసలు నిబంధనలు గాలికి వదిలేశారని, ఈ కారణంగానే ఈ సంఘటనకు అవకాశంగా మారిందని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సదరు జిరాక్స్ కేంద్రం వద్ద పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశ్నలకు చెందిన జవాబుల జిరాక్సు కాపీలను తీసుకునే యత్నంలో కొందరు ఫొటోలు తీసే ప్రయత్నం చేయగా సదరు విద్యార్థులు అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. ఐదు పరీక్షా కేంద్రాల్లో ఏ కేంద్రం నుంచి ఈ ప్రశ్నలను బయటికి పంపారనే విషయం తేలాల్సి ఉన్నది. ఘటనపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.