ఉమ్మడి నిజామాబాద్‌లోని సబ్ రిజిస్ట్రార్ల అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం రిజిస్ట్రేషన్ల శాఖలో కలకలం రేపుతున్నది. అక్రమాలపై లోతైన విచారణ చేపట్టాల్సిందిగా ఆ శాఖ కరీంనగర్ డీఐజీ ఎస్డీ ట్వింకిల్ జాన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. భూసమస్యలకు సత్వర.. శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా పారదర్శకంగా సేవలందించేందుకు ప్రభుత్వం గత ఏడాది ధరణి సేవలను ప్రారంభించింది. కాగా ధరణి పోర్టల్ ప్రారంభానికి ముందు వ్యవసాయ భూముల విలువపై ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లనుంచి నివేదికలను కోరింది. క్షేత్రస్థాయి భూవిలువకు భిన్నంగా కొందరు సబ్ రిజిస్ట్రార్లు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు లోపం ఎక్కడ జరిగిందో ఆరా తీశారు. కొంతమంది సబ్రిజిస్ట్రార్లు ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు సమర్పించినట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
నిజామాబాద్, ఆగస్టు 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధరణి సేవలు ఆరంభించే వరకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల వ్యవహారంతో సామాన్య ప్రజలు విలవిల్లాడిపోయారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ విషయంలో తిమ్మిని బమ్మిని చేసి ఇరు శాఖల అధికారులు అందిన కాడికి దండుకున్నారు. భూమి లేని వ్యక్తికి ఉన్నట్లుగా, భూయజమానికి భూమి లేనట్లుగా తిరకాసు చేసి ఎందరినో రోడ్డు పాలు చేసిన ఘన త వీఆర్వోలకే చెల్లింది. ప్రజలకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల బదలాయింపు విషయంలో భారీ ఊరటను కలిగించేందుకు సీఎం కేసీఆర్ కేసీఆర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ధరణి పోర్టల్‌ను 2020, అక్టోబర్ 29న ఆరంభించి తహసీల్ కార్యాలయంలో వ్యవసాయ భూముల పేరు మార్పిడి క్షణాల్లో జరిగేలా ఏర్పాట్లు చేశారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు యథావిధిగా సంబంధిత శాఖకే బాధ్యతలు అప్పగించారు. అయితే… ధరణి పోర్టల్ ప్రారంభానికి ముందు వ్యవసాయ భూముల అంచనాలపై ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లను నివేదికలను కోరింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పేరు మోసిన అక్రమార్కులు తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారు. ఫలితంగా తక్కువ విలువ ఉన్న భూములు ఎక్కువగా, ఎక్కువ భూములున్నవి తక్కువగా నమోదు కావడాన్ని గుర్తించింది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ కరీంనగర్ డీఐజీ ఎస్.డి. ట్వింకిల్ జాన్‌ను విచారణకు ఆదేశాలివ్వడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లలో వణుకు మొదలైంది.
భూముల విషయంలో ఘర్షణలకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం నూతన విధానం భూమి రికార్డుల నిర్వహణ పద్ధతి(టీఎల్‌ఆర్‌ఎంఎస్) తీసుకు వచ్చింది. ఇందులో భూములకు సంబంధించిన సమస్త విషయాలను క్రోడీకరిస్తూ ధరణి వెబ్సైట్లో పొందుపర్చారు. గ్రామ స్థాయిలో చిన్నచిన్న పనులు, పేర్ల మార్పులు వంటివి చేసినా రాష్ట్రస్థాయి అధికారుల వరకు క్షణాల్లో తెలిసి పోతుంది. ప్రతీ విషయంలో పారదర్శకత, జవాబుదారీ ఉండేలా నూతన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా భూతగాదాల నివారణే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించింది. ఆధునికతను జోడించి ధరణి పేరుతో కొత్త వెబ్‌సైట్‌ను రాష్ట్ర సర్కారు తీర్చిదిద్దింది. ఇందులో నమోదు చేసిన వ్యవసాయ భూముల విలువలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని కొంత మంది సబ్ రిజిస్ట్రార్లు క్షేత్ర స్థాయికి భిన్నంగా నివేదికలు ఇచ్చినట్లుగా తేలింది. దీంతో అవాక్కైన ఉన్నతాధికారులు తప్పులు సరి చేశారు. లోపం ఎక్కడ జరిగిందో సంబంధిత అధికారుల నుంచి రాతపూర్వకంగా వివరణ తీసుకున్నారు. విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే సబ్ రిజిస్ట్రార్లు ఉద్దేశ్య పూర్వకంగానే ఈ తంతును నడిపించినట్లుగా తెలిసింది. విలువలు తారుమారు చేయడం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లాభం జరిగేలా ప్రవర్తించినట్లుగా అనుమానాలు బలపడడంతో రిజిస్ట్రేషన్ శాఖ కరీంనగర్ డీఐజీని విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
గడిచిన ఐదారేండ్లలో ఉమ్మడి జిల్లాలోని పలువురు సబ్ రిజిస్ట్రార్ల వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. ఇప్పటి వరకు పలువురు అధికారుల తప్పుడు నిర్ణయాలతో 14 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో అత్యధికులు సబ్ రిజిస్ట్రార్ హోదాలో పని చేసిన వారే ఉన్నారు. కేసులు నమోదు కావడం, శాఖాపరమైన విచారణ ఎదుర్కోవడం, కొన్నాళ్లకు మామూలుగానే విధుల్లోకి చేరడం ద్వారా తప్పుడు వ్యక్తులతో రిజిస్ట్రేషన్ శాఖ అపకీర్తిని మూట కట్టుకుంటున్నది. ఆది నుంచి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లు తీవ్రమైన అవినీతి, అడ్డదారులకు అలవాటు పడిన దాఖలాలు అనేకం వెలుగు చూశా యి. నేటికీ ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లపై కేసులు నడుస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గతంలో నిజామాబాద్‌లో పని చేసి దోమకొండలో రిటైర్ అయిన ఓ అధికారి ఏకంగా పదుల సంఖ్యలో రైతుల వ్యవసాయ భూమిని అప్పనంగా ఇతరులకు రాసివ్వడంతో వ్యవహారం కోర్టుకెక్కింది. నిరక్షరాస్యులు, భూములపై అవగాహన లేమితో ఉన్న వారిని నట్టేటా ముంచిన ఘనాపాటీలు ఎందరో ఉభయ జిల్లాలో నేటికీ పని చేస్తున్నారు. తాజాగా కొద్ది రోజుల క్రితం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలు జరిగాయి. ఇందులో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసిన వారికి సైతం సబ్ రిజిస్ట్రార్లుగా అవకాశం దక్కింది. ఇప్పుడు వీరంతా ఇష్టారీతిన వ్యవహరిస్తూ అడ్డూఅదుపు లేకుండా ప్రవర్తిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్‌గా ఇన్చార్జి అధికారి ఉండడంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగుతున్నది.
వ్యవసాయ, ప్రభుత్వ, అసైన్డ్ భూముల విషయంలో నిబంధనలను తుంగలో తొక్కి సబ్ రిజిస్ట్రార్లు ఇష్టానుసారంగా అక్రమార్కులకు రిజిస్ట్రేషన్లు చేశారు. వందలాది ఎకరాల భూమి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో దొంగ రిజిస్ట్రేషన్ కాగితాలతో ఎంతో మంది అనర్హులకు హక్కు పత్రా లు జారీ చేశారు. సబ్ రిజిస్ట్రార్లు చేసిన తప్పిదాలతో భూముల పేరిట ఘర్షణలు చోటు చేసుకున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. సామాన్యులు అనేక మంది రోడ్డున పడి కోర్టు చుట్టూ తమ భూమి కోసం పోరాటం చేస్తున్న దాఖలాలు అనేకం. ధరణి పోర్టల్‌తో ఇలాంటి అక్రమాలకు అవకాశమే లేకుండా పోయింది. భూ తగాదాలకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం సమస్త విషయాలను క్రోడీకరిస్తూ ధరణి వెబ్‌సైట్‌ను తీసుకు రావడంతో వ్యవసాయ భూముల లావాదేవీలు సులువుగా మారింది.
ఇంతకు ముందు వ్యవసా య, వ్యవసాయేతర ఆస్తులు కలిపి రిజిస్ట్రేషన్ కా ర్యాలయాల్లోనే జరిగేవి. ప్రస్తుతం వ్యవసాయేతర ఆస్తులు మాత్రమే జరుగుతున్నాయి. నిజామాబా ద్, కామారెడ్డి జిల్లాలో మొత్తం 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నిజామాబాద్ అర్బన్, ని జామాబాద్ రూరల్, ఆర్మూర్, భీమ్‌గల్, బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, దో మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి.