సంక్షేమం, సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు
పల్లెప్రగతితో మారుతున్న గ్రామాల రూపురేఖలు
అణగారిన వర్గాలకు అండగా సీఎం కేసీఆర్
కులవృత్తులకు భరోసా.. రైతులకు బాసట..
దళితబంధుతో పేద కుటుంబాల్లో పండుగ వెలుగు
సంక్షేమ పథంలో ప్రగతిరథం దూసుకుపోతున్నది. ఏడేండ్ల బిడ్డ తెలంగాణ.. అప్పుడే సమగ్రాభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. సమైక్య పాలన అవశేషాలను వదిలించుకుని..
అవాంతరాలను అధిగమించి ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నది. కుతంత్రాలను ఛేదించుకుని, విఘ్నాలను దాటుకుని ముందుకెళ్తున్నది. ఒక్కో పథకాన్ని అమలుచేసి చూపించి.. మిగితా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖల్ని మార్చిన ప్రభుత్వం.. రైతులు, వృత్తిదారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. అణగారిన వర్గాల ఆర్థికస్వావలంబన దిశగా తీసుకువచ్చిన ‘దళితబంధు’తో ఈ వినాయక చవితికి పేదల ఇండ్లలో అసలైన పండుగ వాతావరణం నెలకొన్నది.
నిజామాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రం అద్భుత ప్రగతితో ముందుకుసాగుతున్నది. సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారు. సమై క్య రాష్ట్రంలో రైతులకు ఎదురైన అనుభవాలు గుర్తుకు తెచ్చుకుం టే కంట కన్నీరు వస్తుంది. అలాంటి రైతు ప్రయోజనకర పథకా లతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నిర్లక్ష్యానికి గురైన కుల వృత్తిదారులకు చేయూతను అందిస్తూ కొండంత అండగా నిలుస్తున్నారు. ఆడబిడ్డల పెండ్లిలకు పేద కుటుంబాల్లో తీవ్రమైన ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ రూపంలో అందుతున్న సాయంతో పేదింట వివాహ వైభోగం కనిపిస్తోంది. కాన్పునకు వచ్చే గర్భిణులకు ఉచితంగా వైద్యం అందించడం, కేసీఆర్ కిట్‌తో పాటుఆర్థిక సాయం అందించడం ద్వారా మహిళలకు ఎంతగానో పాటుపడుతోంది. సాగు కష్టాలు తీర్చేందుకు కాళేశ్వరం పథకం ద్వారా మహా క్రతువును విజయవంతంగా అమలుచేస్తున్నారు. ఇంటింటా తాగునీటి ఇక్కట్లకు మిషన్ భగీరథతో చెక్ పెట్టారు. ఇలా ప్రజలకు తీరని భారంగా ఉన్న విఘ్నాలు సీఎం కేసీఆర్ పరిపాలనలో పూర్తిగా తొలగిపోయా యి. నేడు వినాయక చవితి సందర్భంగా ఏడేండ్ల పరిపాలనలో కేసీఆర్ సారథ్యంలో పండుగలా మారిన వ్యవసాయంతో పాటు గా సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రత్యేక కథనం.
ఆదర్శంగా పల్లె ప్రగతి…
గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సీఎం కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా పల్లె ప్రగతి కార్యక్ర మాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. రోడ్లను శుభ్రం చేయడం, ఇరువైపులా మొక్కలను నాటించడం, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇచ్చిం ది. జీపీలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, కంపోస్ట్ షెడ్డు, డంపింగ్ యార్డు నిర్మించారు. పల్లె ప్రగతిలో భాగంగా తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి మండ లంలో పది ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారు. 31వేల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొం దించారు.
సుందరంగా పట్టణాలు
పట్టణ ప్రగతి కార్యక్రమాలు మున్సిపాలిటీల దిశను మార్చుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 2020-21లో రూ.66.34కోట్లు, 2021-22లో రూ.25.58 కోట్లు నిధుల కేటాయింపులు జరిగాయి. నగర పాలక సంస్థకు మురుగునీటి శుద్ధి ప్రాజెక్టు రూ.246కోట్లతో, అమృత్ పథకం కింద రూ.30.32 కోట్లు మంజూరయ్యాయి. 97శాతం పనులు పూర్తయ్యాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో 14 ఆర్థిక సంఘం నిధులతో రూ. 1.79కోట్లతో 2 ట్రాక్టర్లు, 12 ఆటో టిప్పర్లు, 1 బ్లేడ్ ట్రాక్టర్, 1 స్వీపింగ్ మిషన్, ప్రతి ఇంటికీ డస్ట్ బిన్లు అందించారు. వివిధ వార్డుల్లో రూ.1.19కోట్లతో ము రికి కాలువల నిర్మాణం చేపట్టారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా భీమ్‌గల్ మున్సిపాలిటీకి రూ.25కోట్లు, బోధన్ మున్సిపాలిటీకి రూ.50కోట్లు మంజూరు కాగా ఆ పట్టణాలు తళుక్కుమంటున్నాయి.
కాళేశ్వర సాగు సంబురం
ఎస్సారెస్పీ నుంచి నీటిని ఎత్తిపోసి నిజామాబాద్‌కు తాగునీటితోపాటు నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం ముఖ్యోద్దేశంగా నిజామాబాద్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. నవీపేట మండలం బినోల గ్రామం వద్ద ఎస్సారెస్పీ నుంచి నీటిని తీసుకుని సారంగపూర్ వద్ద పంప్ హౌస్ ద్వారా నిజాంసాగర్ కాలువలోకి నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పా ట్లు జరుగుతున్నాయి. నిజాంసాగర్ కాలువ నుంచి నీటిని మెట్రాజ్‌పల్లి పంప్ హౌస్ వద్ద తీసుకుని పైప్‌లైన్ నెట్వర్క్ ద్వారా నిజామాబాద్ జిల్లాలో 95వేలు, జగిత్యాల జిల్లాలో 20వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. నిజాంసాగర్ కాలువ నుంచి నీటిని మాసాని చెరువు తర్వాత మంచిప్ప గ్రామం వద్ద కొండెం చెరువులోకి ఎత్తిపోసే ప్రక్రియకు చేపడుతున్నారు. కొండెం చెరువు నుంచి కామారెడ్డి జిల్లాలోని ఆయకట్టుకు నీటిని తరలించేందుకు పనులు చకచకా కొనసాగుతున్నాయి. మిగిలిన నీటిని మంచిప్పకు తరలించి పైప్‌లైన్ ద్వారా జిల్లాలో 85వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. కొండెం, మంచిప్ప చెరువులను కలిపి 3. 500 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తుండడం విశేషం.
రైతులకు కొండంత భరోసా
వానాకాలం 2021-22లో ఇప్పటి వరకు 2,39, 903 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.264.94కోట్లు చెల్లింపు లు జరిగాయి. ఎకరానికి 5వేల చొప్పున రైతు ఖాతాల్లో నేరుగా జమ చేశారు. 2020-21లో జిల్లాలో 1058 మంది రైతులకు రైతుబీమా క్లెయిమ్‌లు రూ.52.90కోట్లు చెల్లింపులు జరిగాయి. ఒక్కో రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందింది. పంట రుణ మాఫీ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 17,711 మంది రైతులకు 25వేలలోపు రుణం కలిగిన వారికి రుణ మాఫీ చేశారు. రూ.20.10కోట్లు వారి ఖాతాల్లో జమ చేసి రుణ మాఫీ ప్రక్రియను పూర్తి చేశారు. రెండో విడతలో 50 వేలలోపు రుణాలున్న 27,601 మంది రైతులకు రూ.85. 85 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ 2014 నుంచి తీవ్రంగా కృషి చేస్తున్నారు. గతంలో వ్యవ సాయం అంటేనే దండగ అనే పద్ధతి నుంచి నేడు పండుగ అన్నట్లుగా మారింది.
దళితులకు నిజమైన పండుగ..
రాష్ట్రంలో వినాయక చవితికి విశిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది. చవితి నోములు, వినాయక ప్రతిమలను ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు కొలవడం పరిపాటి. విఘ్నాలు పోగొట్టి శుభాలు చేకూరాలని ప్రజలంతా పండుగను ఆర్భాటంగా చేసుకుంటారు. దళిత వర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం పేరిట వారి జీవితాల్లో పండుగను తీసుకువచ్చారు. పేదరికంలో తీవ్రంగా మగ్గిపోతున్న కుటుంబాలను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో మొదలైన దళిత బంధు పథకం క్రమంగా అంతటా అమలుకానుంది. ఈ పథకంపై జిల్లా వ్యాప్తంగా విశేషమైన స్పందన వస్తోంది. దళిత ప్రజలంతా కేసీఆర్ తీసుకు వచ్చిన పథకాన్ని ప్రశంసిస్తూ తమ దేవుడిగా కొలుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో నుంచి వచ్చిన ఈ పథకాన్ని అణగారిన వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం అమలు చేస్తున్నారు. ఇదీ వినూత్నమైన ఆచరణాత్మక కార్యక్రమం. త్వరలోనే ఈ పథకం ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు అందనున్నాయి.