కరోనా భయం వీడి బడి బాట పడుతున్న విద్యార్థులు..
ప్రత్యక్ష బోధనకు క్రమంగామొగ్గు చూపుతున్న తల్లిదండ్రులు
ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తోన్న విద్యా శాఖ అధికారులు
ఇంటి వద్ద చదువులతో మానసిక ఇబ్బందులంటున్న నిపుణులు
పాఠశాలల్లో కొవిడ్ -19 నిబంధనల అమలుపై విద్యాశాఖ ఆకస్మిక తనిఖీలు
కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఏడాదిన్నరగా మూతపడిన పాఠశాలలు ఈ నెల ఒకటి నుంచి తెరుచుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాఠశాలలు సందడిగా మారాయి. ప్రత్యక్ష బోధన మొదలుకావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి ఆసక్తిచూపుతున్నారు. ప్రత్యక్ష తరగతులతో పిల్లలకు కలిగే ప్రయోజనాలను అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. బడుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో స్థితిగతులను తెలుసుకునేందుకు జిల్లా అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 1673 స్కూళ్లలో 2,37,328 మంది విద్యార్థులుంటే 38.04 శాతం అంటే 90,278 మంది ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం లక్షా 35,252 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో పదో తరగతిలో 12,958 మంది ఉండగా, వారి తల్లిదండ్రులు అధిక శాతం ప్రత్యక్ష తరగతుల వైపే మొగ్గు చూపుతుండడం గమనార్హం.
నిజామాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొవిడ్ మహమ్మారితో మూతపడిన పాఠశాలలు ఎట్టకేలకు తెరుచుకోవడంతో క్రమంగా విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. సుమారు ఏడాదిన్నర తరువాత అన్ని తరగతుల విద్యార్థులకూ సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రత్యక్ష బోధన మొదలైంది. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సిద్ధం కావడంతో తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను పాఠశాలకు పంపుతున్నారు. బడిగంట మోగే సమయానికి పాఠశాలలో ఎలాంటి సమస్యలు లేకుండా విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన తరగతి గదులు, క్రీడా స్థలాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆయా పాఠశాలల పరిసరాల్లో చెత్తా చెదారాన్ని తరలించి శుభ్రం చేశారు. కరోనా మూలంగా సుమారుగా ఏడాదిన్నరగా ప్రత్యక్ష బోధన నిలిచిపోయింది. పాఠశాలల నిర్వహణ సైతం గాడి తప్పింది. తిరిగి స్కూళ్లు తెరుచుకుంటుండడంతో ప్రభుత్వం ఈ మేరకు చకచకా ఏర్పాట్లు చేసింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బడులు పునః ప్రారంభించాలని ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరంభంలో సంశయానికి గురైన వారంతా ఇప్పుడు పాఠశాలలకు పిల్లలను పంపించడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రత్యక్ష తరగతు ల ద్వారా పిల్లలకు కలిగే లాభ నష్టాలపై విద్యా శాఖ అధికారులు అవగాహన సైతం కల్పిస్తున్నారు.
బడి బాట
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు 1166 ఉన్నాయి. వీటిలో 1,09, 317 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి లో మొదటి రెండు రోజుల పాటు 37శాతం అంటే 40,610 మంది పిల్లలు మాత్రమే స్కూళ్లకు వచ్చారు. నాలుగో రోజు 56,456 మంది విద్యార్థులు పాఠశాలకు రావడంతో హాజరు శాతం క్రమంగా పెరిగింది. శనివారం 51.64శాతం హాజరు నమోదు కావడం విశేషం. ఎయిడెడ్ స్కూళ్లు 39 ఉండగా 9,333 మంది విద్యార్థులకు మొదటి రోజు 12శాతం మంది స్కూళ్లకు రాగా నాలుగో రోజు నాటికి 14.51శాతం మంది అంటే 1354 మంది ప్రత్యక్ష బోధనకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 468 ప్రైవేటు పాఠశాలలున్నా యి. వీటిలో 1,18,678 మంది విద్యార్థులు ఎన్రోల్ అయ్యారు. వీరిలో 32,468 మంది విద్యార్థులు అంటే 27.36 శాతం మంది మాత్రమే స్కూళ్లకు వచ్చారు. నిజామాబాద్ జిల్లాలో 1673 స్కూళ్లకు 2,37,328 మంది విద్యార్థులుంటే 38. 04 శాతం అంటే 90,278 మంది ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. క్రమంగా వీరి సంఖ్య పె రుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పెరుగుతున్న హాజరు శాతం..
కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు మొత్తం 1017 ఉన్నాయి. ఇందులో 85, 347 మంది విద్యార్థులున్నారు. మొదటి రోజు 36వేల మంది మాత్రమే స్కూళ్లకు హాజరవ్వగా నాలుగో తేదీ వరకు వారి సంఖ్య 44, 375 మం దికి చేరింది. ఒకట్రెండు రోజుల్లోనే ప్రత్యక్ష తరగతులకు దాదాపుగా తొమ్మిది వేల మంది విద్యార్థులు ఎక్కువగా హాజరుకావడం విశేషం. ప్రైవే టు, ఎయిడెడ్ పాఠశాలలు మొత్తం 175 ఉన్నా యి. వీటిలో 44,613 మంది విద్యార్థులు పేర్లను ఎన్రోల్ చేసుకున్న వారున్నారు. తొలి రో జు 9300 మంది హాజరుకాగా నాలుగో రోజుకు 99 39 మంది విద్యార్థుల హాజరు శాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1నుంచి 10వ తరగతి వరకు మొత్తం లక్షా 35వేల 252 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో పదో తరగతిలో 12,958 మంది విద్యను అభ్యసిస్తున్నా రు. పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక శా తం ప్రత్యక్ష తరగతుల వైపే మొగ్గు చూపుతుండ డం విశేషం. పాఠశాలలు పునః ప్రారంభం తో ప్రై వేటు, ప్రభుత్వ స్కూళ్లలో పకడ్బందీ ఏర్పా ట్లు చేశారు. నిర్లక్ష్యం వహిస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నమ్మకం కోల్పోయే అవకాశం ఏర్పడటంతో కొవిడ్ జాగ్రత్తలు తప్పక పాటిస్తున్నారు.
మాస్క్ ఉంటేనే…
తరగతి గదికి వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరి. మాస్కు లేకుంటే గదిలోకి అనుమతి ఇవ్వడం లేదు. ప్రతి టీచర్ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుని ఉండాలి. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పిల్లల సంపూర్ణ రక్షణకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం పాఠశాలల్లో సమకూర్చింది. ప్రతి విద్యార్థి మాస్కు ధరించి పాఠశాలలకు వచ్చేలా అవగాహన సైతం కల్పిస్తున్నారు. స్కూళ్లలో వీలైనంత మేరకు భౌతికదూరం పాటించేలా తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా సబ్బు, లిక్విడ్ అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇచ్చారు. పాఠశాలల పునః ప్రారంభంతో తెరుచుకున్న ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో స్థితిగతులను తెలుసుకునేందుకు నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు అమలు అవుతున్నాయా? లేవా? అన్నది ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు విధుల్లో మాస్కు వినియోగించకపోతే వారిని తీవ్ర స్థాయిలో మందలించారు. ఇకపై మాస్కు ధరించని వారిపై చర్యలు తీసుకునేందుకు విద్యా శాఖ సైతం సిద్ధం అవుతోంది. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు సైతం ఉభయ జిల్లాల్లో తనిఖీలు చేయనున్నారు.
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లను తెరిచాము. విద్యార్థుల రాకకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాము. ప్రైవేటు, ప్రభుత్వ బడుల్లో క్రమంగా హాజరు శాతం పెరుగుతోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాము. తీసుకుంటున్న జాగ్రత్తలపైనా వివరిస్తున్నాము. ఉపాధ్యాయులు, సిబ్బందికి మాస్కులు తప్పకుండా పాటించాలని ఆదేశించాం. కరోనా మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
ప్రత్యక్ష బోధనతోనే పరిపక్వత…
ఆన్లైన్ క్లాసుల మూలంగా చాలా మంది పిల్లలు ఒకింత బందీగా ఫీలయ్యారు. ఇంటి నుంచి బయటకు కాలు పెట్టకపోవడం మూలంగా మానసికంగా కుంగుబాటుకు గురయ్యారు. ప్రత్యక్ష తరగతులతో పాఠశాల స్థాయి విద్యార్థులందరికీ మేలు జరుగుతుంది. స్కూల్కు పోవడం ద్వారా స్నేహితులతో కలిసి చదువుకోవడం మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది. క్రమబద్ధమైన జీవన శైలికి అలవాటు పడతారు. ఒంటరిగా ఆన్లైన్ పాఠాలు వినడం ద్వారా పిల్లలెంతో మంది ఒంటరి తనంతో బాధపడుతున్నారు.