కామారెడ్డి జిల్లాలో 65,260 ఎకరాల్లో సాగు
పచ్చిబుట్ట విక్రయంతో లాభాలు
స్వీట్‌కార్న్ సైతం పండిస్తున్న రైతులు
రాళ్ల భూములు కావడంతో ఇతర పంటల సాగుకు దూరం
సదాశివనగర్, సెప్టెంబర్ 5: తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలను ఇస్తున్న మక్కజొన్న సాగువైపు కామారెడ్డి జిల్లా రైతులు మక్కువ చూపుతున్నారు. కొద్దిపాటి నీటి వసతి కలిగిన మక్కజొన్న పంట తక్కువ సమయంలోనే చేతికి వస్తుండడంతో ఈ పంట వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 65, 260ఎకరాల్లో మక్క పంటను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలోని సదాశివనగర్ మండలంలో 8, 321 ఎకరాల్లో మక్క సాగవుతున్నది. మక్కను ప్రధానంగా జిల్లాలోని సదాశివనగర్, గాంధారి, మాచారెడ్డి, లింగంపేట్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లం, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, కామారెడ్డి, రాజంపేట్, రామారెడ్డి మండలాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. రాళ్ల భూములు, ఇతర పంటలు పండకపోవడంతో ఎక్కువ సంఖ్యలో రైతులు మక్కజొన్న పంటనే సాగు చేస్తున్నారు. 60 రోజుల్లోనే చేతికి వచ్చే పచ్చిమక్క బుట్టలను హైదరాబాద్, కామారెడ్డి తదితర పట్టణాలకు సరఫరా చేసి కాల్చి అమ్ముతున్నారు. ఒక్కో మక్కెనను రూ.10కి విక్రయిస్తున్నారు. పలువురు రైతులు సైతం స్వయంగా పచ్చి మక్కెన్లను అమ్ముతూ లాభాలు పొందుతున్నారు.
స్వీట్ కార్న్ సాగు సైతం..
కామారెడ్డి జిల్లాలోని కుప్రియాల్, రామేశ్వర్‌పల్లి, తిర్మన్‌పల్లి, గుర్జకుంట, తిప్పాపూర్ గ్రామాల్లో స్వీట్‌కార్న్ పండిస్తున్నారు. రైతులు స్వీట్‌కార్న్‌ను ఆటోల్లో తీసుకువచ్చి అమ్ముతున్నారు. స్వీట్‌కార్న్‌కు మంచి గిరాకీ ఉంది. ఫౌల్ట్రీ ఫాంలకు సైతం మక్కల అవసరం ఉండడంతో రైతులు మక్కను పండిస్తూ లాభాలు పొందుతున్నారు.
తక్కువ పెట్టుబడి..
తక్కువ పెట్టుబడి, ఎక్కువగా లాభాలు వస్తుండడంతో రైతులు మక్కజొన్న పండిస్తున్నారు. సదాశివనగర్ మండలంలోని 24 గ్రామాల్లో 8, 321 ఎకరాల్లో మక్క సాగు చేస్తున్నారు. మక్కజొన్నను ఆశించే చీడపీడలపై రైతులకు అవగాహన కల్పిస్తూ, నివారణ చర్యలు తీసుకునేలా చూస్తున్నాం.
ఎకరానికి 30 క్వింటాళ్లు..
నేను 4 ఎకరాల్లో మక్కజొన్న సాగు చేస్తున్నాను. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుం ది. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల మక్కలు వస్తాయి. ఇతర పంటలు సాగు చేస్తే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది.