మన రాష్ట్రంలోనే ఎక్కువ సంక్షేమ పథకాలు
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
వర్ని మండలంలో ‘డబుల్ ఇండ్ల’ పనులకు భూమిపూజ
వర్ని, సెప్టెంబర్ 5: నాయకులు హుందాగా వ్యవహరించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మీరు పాలించే రాష్ర్టాల్లో ఏదైనా అభివృద్ధి చేసి చూపించి ఇక్కడ విమర్శించాలని బీజేపీ నేతలకు హితవు పలికారు. వర్ని మండలంలో ఆదివారం పర్యటించిన ఆయన పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోటయ్య క్యాంపులో రూ.15లక్షలతో నిర్మించనున్న కాపు సంఘ భవనానికి, హుమ్నాపూర్ గ్రామంలో రూ.36లక్షలతో నిర్మించనున్న పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి, 40 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు, ఎస్సీ కమ్యూనిటీ భవనాల నిర్మాణం, రాజ్పేట్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. కోటయ్యక్యాంపు, హుమ్నాపూర్ గ్రామాల్లో పలువురి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేనన్ని సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలోనే అమలవుతున్నాయని చెప్పారు, రాష్ట్రంలో ఇప్పటి వరకు 9లక్షల మంది కల్యాణ లక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందగా, అందులో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన వారు 11వేల మంది ఉన్నారన్నారు. సాగు భూములకు నీరందించేందుకు జాకోరా, చందూరు గ్రామాల వద్ద లిఫ్ట్ నిర్మాణానికి రూ.106కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పైడిమల్ వద్ద రిజర్వాయర్, కాలువల నిర్మాణానికి మరో రూ.104 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, వర్ని, రుద్రూర్ జడ్పీటీసీ సభ్యులు బర్దావల్ హరిదాస్, నారోజి గంగారాం, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బందెల సంజీవులు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సింగంపల్లి గంగారాం, కో-ఆప్షన్ సభ్యుడు కరీం, సర్పంచులు బొక్కెటి గంగవ్వ, రాజు, నానిబాబు, సహకార సంఘా ల అధ్యక్షులు కనకారెడ్డి, నామాల సాయిబాబా, కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు కోటగిరి గంగవ్వ, నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, వెలగపూడి గోపాల్, తహసీల్దార్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలమైన తమకు కూడా డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని హుమ్నాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు స్పీకర్‌కు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ టీచర్లు అరుణారాణి, జయశ్రీ, ఆశ కార్యకర్తలు ఉమ, బాలమణి తదితరులు ఉన్నారు.
గిరిజన నృత్యం చేసిన స్పీకర్, సురేందర్ రెడ్డి..
పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వెళ్లిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి రాజ్పేట్ గ్రామంలో గిరిజన సంప్రదాయ నృత్యం చేశారు. గ్రామ మహిళలు నృత్యాలు చేస్తూ వారికి స్వాగతం పలికారు.