‘వాన రాకడ.. కరెంటు పోకడ.. ఎవరూ చెప్పలేర’న్నట్లుగా ఉండేది తెలంగాణ రాకముందు పరిస్థితి. విద్యుత్ కోతలు లేకుండా పూటగడిచేది కాదు. వ్యవసాయానికైనా, గృహ, వ్యాపార, వాణిజ్య అవసరాలకైనా విద్యుత్ కటకట తీవ్రంగా వేధించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో పవర్ సర్ప్లస్ స్టేట్‌గా తెలంగాణ వెలుగుతున్నది. నిరంతరాయ విద్యుత్‌ను ప్రజలకు అందించడంతోపాటు బడుగు, బలహీనవర్గాలకు ఉచితవిద్యుత్ పథకాలను సైతం రాష్ట్రప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దళితవాడలు, గిరిజన తండాల్లో 101 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో 43,569 కుటుంబాలు ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధి పొందుతున్నారు. అర్హులైన దళిత, గిరిజన కుటుంబాలన్నీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
నిజామాబాద్, ఆగస్టు 30, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెల్లో రాష్ట్ర ఏర్పాటుకు మునుపు కరెంట్ ఉంటే వార్త. కరెంట్ కట్ అవ్వడం అనేది నిత్యం పరిపాటిగా ఉండేది. ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు కరెంట్ పోయేదో అర్థం కాని దుస్థితి. వ్యవసాయానికైనా, గృ హ, వ్యాపార, వాణిజ్య అవసరాలకైనా విద్యుత్ కటకట తీవ్రంగా వేధించేది. అ లాంటి దుస్థితిని సీఎం కేసీఆర్ సమూలంగా మార్చివేశారు. రాష్ట్రం సాధించుకున్న తొలినాళ్లలోనే కరెంట్ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించారు. నిరంత విద్యుత్‌ను అందిస్తూ దేశంలోనే రాష్ట్రం ఇప్పుడు ప్రత్యేకతను చాటుకుంటున్నది. విద్యుత్ లోటు తో ఇబ్బందులు ఎదుర్కొన్న చోట రాష్ట్ర అవసరాలకు సరిపడా కరెంట్ అందుబాటులోకి రావడం ఓ చరిత్ర. అంతేకాకుండా విద్యుత్ సరఫరాను కోతల్లేకుండా ప్రజలకు అందిస్తుండడంతో పాటు బడుగు, బలహీన వర్గాలకు ఉచిత విద్యుత్ పథకాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దళిత, గిరిజన కుటుంబాల అవసరాలకు సరిపడా విద్యుత్‌ను తెలంగాణ సర్కారు ఉచితంగా అందిస్తూ తండాలు, దళిత వాడల్లో వెలుగులు నింపుతున్నది.
వేధింపుల నుంచి ఉచితం దాకా…
గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో దళితులు, గిరిజనులు నివాసాల్లో సమైక్య రాష్ట్రంలో కరెంటోళ్ల వేధింపులు నిత్యకృత్యంగా ఉండేవి. కరెంట్ బిల్లులు కట్టలేక ఆ యా కుటుంబాలు తీవ్రంగా సతమతం అయ్యేవి. ఎన్పీడీసీఎల్ సిబ్బంది నిరంతరం కాలనీల్లో సంచరిస్తూ విద్యుత్ స్తంభాల నుంచి కరెంట్‌ను వాడుకుం టే కేసులు పెట్టి జైళ్లకు పంపేది. అక్రమంగా కేసులు బనాయించి ఆయా కుటుంబాలను తీవ్రంగా వేధించేది. కనీసం కరెంట్ బిల్లులు కట్టలేక దళిత, గిరిజన కుటుంబాలు నెల రాగానే తీవ్రంగా సతమతం అయ్యే ది. బిల్లులు చెల్లించలేదనే కారణంతో ఎన్పీడీసీఎల్ సిబ్బంది ఫీజులు పీక్కుపోయేది. లేదంటే మీటర్‌కు లైన్ కట్ చేసేది. ఇలాంటి దౌర్భాగ్యకరమైన దుస్థితి రాష్ట్రం సిద్ధించిన తర్వాత నామరూపాల్లేకుండా పో యింది. సీఎం కేసీఆర్ పాలనలో గిరిజన, దళిత కు టుంబాలకు నెలవారీగా 101 యూనిట్లు దాకా కరెంట్ ఉచితం చేయడంతో ఆయా కుటుంబాల్లో విద్యుత్ ఆర్థిక భారం కనిపించకుండా పోయింది. బిల్లుల చెల్లింపుల సమస్యే లేకుండా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో దళిత, గిరిజనుల్లో విద్యుత్ కాంతులు కనిపిస్తున్నాయి.
43,569 కుటుంబాలకు మేలు…
ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి నెలా 101 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్‌ను వాడుకునే సౌకర్యం కల్పించింది. జిల్లాలో లక్షలాది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలున్నాయి. వీరిలో ఇప్పటి వరకు 48,640 కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు సమర్పించగా ప్రస్తుతం 43,569 కు టుంబాలకు మేలు జరుగుతున్నది. 101 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం లో 29,442 దళిత కుటుంబాలు, 14,127 గిరిజన కుటుంబాలు పైసా కరెంట్ బిల్లు చెల్లించకుండానే విద్యుత్‌ను వాడుకుంటున్నారు. ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తులు సమర్పించిన వారిలో సుమారు 4వేల కుటుంబాల వారు నిబంధనల మేరకు కుల ధ్రువీకరణ పత్రం జత చేయకపోవడంతో పథకం అమలు వారికి నిలిచి పోయింది. సర్కారు కల్పిస్తున్న ఈ ఉచిత విద్యుత్ పథకానికి అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని ఎన్పీడీసీఎల్ కోరుతున్నది. ఇందుకోసం ఇంటి మీటర్ కనెక్షన్ ఉన్న వారు కుల ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత ఏఈకి లేదా ఈఆర్వో కార్యాలయంలో సమర్పిస్తే ఉచిత విద్యుత్ పథకానికి అర్హులుగా పరిగణించబడుతుందని వారు చెబుతున్నారు. ఒక వేళ ఈ పథకం అమలవుతున్న లబ్ధిదారుడు చనిపోతే తదనంతరం ఇంట్లో నివసిస్తున్న వారి పేరిట పత్రాలను మీ సేవ ద్వారా మార్పిడి చేసుకుంటే ఎన్పీడీసీఎల్లో నెల రోజుల్లోనే ఉచిత విద్యుత్‌ను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
దళితవాడల్లో విద్యుత్ లైన్ల పునరుద్ధరణ…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత బంధు పథకం ఇప్పటికే ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాల వివరాల సేకరణ సైతం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో దళిత వాడల్లో ప్రత్యేక విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీల్లో 563 దళితవాడలు, 245 గిరిజన ఆవాసాలున్నాయి. ఈ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, కొత్తగా స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు కోసం సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 133.99 కిలో మీటర్ల మేర కొత్త లైన్లు, 254 ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్నట్లుగా గుర్తించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో భాగంగా అమలైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా కరెంట్ సమస్యలు కనిపించకుండా పోయాయి. వంగిన స్తంభాలు, వేలాడుతున్న కరెంట్ తీగలు, ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్లు, మాటిమాటికి విద్యుత్ అంతరాయం అనేవి ఇప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో కనిపించడం లేదు. ఏండ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు ఎట్టకేలకు పరిష్కారం అయ్యాయి. గతంలో పట్టణాల్లో ప్రమాదకరంగా, రోడ్డు మధ్యలో, ఇండ్లకు దగ్గర్లో ఉన్న విద్యుత్ స్తంభం మార్చాలంటే అంచనాలు రూపొందించి, దానికయ్యే ఖర్చును వినియోగదారుడు భరించాల్సి వచ్చేది. పల్లె, పట్టణ ప్రగతితో విద్యుత్ శాఖనే స్వయంగా విద్యుత్ సమస్యలను గు ర్తించి వాటిని మార్చేందుకు ప్రణాళిక రూపొందించింది. వార్డుల వారీగా సమస్యలుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూశారు.
ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ద్వారా దళిత, గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం అమలవుతున్నది. నెలకు 101 యూనిట్లు వరకు ఖర్చయ్యే కరెంట్‌కు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకాన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు సంబంధించి ఎన్పీడీసీఎల్ ఏఈలను లేదంటే ఈఆర్వో కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పిస్తే ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తాం.