ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురి ఎంపిక
ఉపాధ్యాయ దినోత్సవం రోజున అవార్డుల ప్రదానం
తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు భవిష్యత్తుకు బాట చూపుతారు. అక్షర ఓనమాలు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. దేశ ప్రథమ పౌరుడైనా.. ఎంతటిస్థాయిలో ఉన్నా .. గురువు లేనిదే ఆ వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేడు. క్రమశిక్షణ, సమయ పాలన, విధి నిర్వహణలో నిబద్ధతకు నిదర్శనం ఉపాధ్యాయవృత్తి. విద్యార్థులకు అలాంటి ఉత్తమ విద్యనందించిన వారే ఉత్తములు అవుతారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఉండడం విశేషం.
గర్వంగా ఉన్నది..
జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామానికి చెందిన పొలాస రాములు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికయ్యారు.17.10.2002 లో మంథని యూపీఎస్ పాఠశాలలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన మొదటి నుంచి పాఠశాల అప్‌గ్రేడ్ కోసం కృషిచేశారు. 2003లో పీఎస్, జడ్పీహెచ్ఎస్గా విభజించారు. 2012లో చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి స్మారక అవార్డును అందుకున్నారు. 2017లో మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2018లో స్వచ్ఛ విద్యాలయ పురస్కారాన్ని అందుకున్నారు. 2018లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. పాఠశాలలో హరితహారం, బడి బయటి పిల్లలను బడిలో చేర్పించడం, దాతల నుంచి విరాళాలు సేకరించి పాఠశాలను అభివృద్ధి చేశారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికవ్వడం గర్వంగా ఉన్నదని రాములు సంతోషం వ్యక్తం చేశారు.
అవార్డుకు ఎంపికవడం ఆనందంగా ఉంది
డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన ఎన్.మురళీధర్ 2002లో పొతంగల్కలాన్ పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌గా చేరి మూడేండ్లు పని చేశారు. 2005 నుంచి 2015 వరకు దుబ్బాకలో పని చేసి 2015లో యానంపల్లికి బదిలీపై వచ్చారు. స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా, బుక్ రైటర్‌గా, వర్క్‌షీట్స్ తయారీలోనే కాకుండా తన విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక బహుమతులు పొందడంతోపాటు యానంపల్లి ఉన్నత పాఠశాలకు రాష్ట్ర ఉత్తమ స్వచ్ఛ అవార్డుకు కృషి చేశారు. 2016,2017, 2018లో జిల్లా ఉత్తమ స్వచ్ఛ అవార్డులు పొందింది. మురళీధర్ రాష్ట్ర పరిశీలకుడిగా ఎస్సీఈఆర్టీకి పని చేశారు. తనను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. విద్యార్థులకు తాను బోధించిన విద్యను గుర్తించి అవార్డును అందించడం జీవితంలో మర్చిపోలేను. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని చెబుతున్నారు.
సమష్టి కృషితోనే సాధ్యమైంది..
ఆర్మూర్ మున్సిపల్లోని పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీతయ్య మూడేండ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. దాతల సహకారంతో లక్షల రూపాయలతో పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. విద్యార్థుల అభ్యున్నతికి, భావితరాల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయ బృందంతో కలిసి అహర్నిశలు కృషి చేస్తున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు రావడం సంతృప్తినిచ్చిందని, ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే ఈ అవార్డు సాధ్యమైందని ఆయన సంతోషం వ్యక్తంచేశారు.