డిచ్పల్లి, సెప్టెంబర్ 3: తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ ఏ.నాగరాజు, భిక్కనూరులోని సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్‌గా డి.నాగరాజు నియమితులయ్యారు. టీయూ వైస్ చాన్స్‌లర్ డి.రవీందర్ గుప్తా ఆదేశాల మేరకు ఆచార్య కనకయ్య వారికి శుక్రవారం నియామకపత్రాలను అందజేశారు. డాక్టర్ ఏ.నాగరాజు గతంలో పరీక్షల నియంత్రణ అధికారిగా బాధ్యతలను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రసాయన శాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్‌గా నియమితులైన డాక్టర్ డి.నాగరాజు రసాయన శాస్త్ర విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గతంలో సౌత్ క్యాంపస్ వార్డెన్‌గా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రిన్సిపాల్‌గా నియమితులైన ఇద్దరికీ పలువురు అధ్యాపకులు అభినందించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
పరీక్ష ఫీజు గడువు పొడిగింపు..
డిగ్రీ(సీబీసీఎస్) రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువును ఈనెల 11వ తేదీ వరకు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో వంద రూపాయల అపరాధ రుసుముతో సెప్టెంబర్ 2వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుముతో 4వ తేదీ వరకు గడువు ఉండగా .. రూ. వంద లేట్ ఫీజుతో ఈనెల 11వ తేదీ వరకు, రూ.ఐదు వందల లేట్ ఫీజుతో 14వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో 7వ తేదీ వరకు ఉన్న గడువును 16వ తేదీ వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కళాశాలలు తమ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్‌లను సెప్టెంబర్ 20వ తేదీలోపు సమర్పించాలని ఆయన సూచించారు.
21నుంచి టీయూ పరిధిలో డిగ్రీ పరీక్షలు ..
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ రెండో సెమిస్టర్ మొదటి రెగ్యులర్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.