కలెక్టర్ నారాయణరెడ్డి
ఎడపల్లి (శక్కర్‌నగర్), సెప్టెంబర్ 2: విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు మళ్లీ మొదటి నుంచి బోధించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి ఆన్లైన్ బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. తరగతుల వారీగా విద్యార్థులకు పలు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు వేయగా వారి నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో ఆయన ఉపాధ్యాయులు, ఆన్లైన్ తరగతుల తీరుపై అసహ నం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అన్ని తరగతుల వారికి మొదటి నుంచి బోధించాలన్నారు. పాఠశాల ఆవరణను శుభ్రం చేయించాలని, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా సౌకర్యాలు సమకూర్చాలని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రం టీచర్ తీరుపై ఆగ్రహం
జాన్కంపేట్ పాఠశాల పరిసర ప్రాంతంలోనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించారు. అంగన్వాడీ కేంద్రానికి హాజరవుతున్న చిన్నారుల సంఖ్య, రికార్డులు సరిగా లేకపోవడంతో సదరు అంగన్వాడీ కేంద్రం నిర్వాహకురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే సమయంలో అక్కడ ఉన్న వైద్య సిబ్బంది, ఆశవర్కర్లతో మాట్లాడిన కలెక్టర్ నారాయణరెడ్డి గ్రామంలో విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని, ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, సర్పంచ్ సాయిలు, ఎంపీటీసీ సంజీవ్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు విజయ్ కుమార్గౌడ్తోపాటు పలువురు గ్రామస్తులు ఉన్నారు.
స్కూళ్లను సందర్శించిన అదనపు కలెక్టర్
భీమ్‌గల్, సెప్టెంబర్ 2: మండలంలోని బడా భీమ్‌గల్, సికింద్రాపూర్, గోన్‌గొప్పుల పాఠశాలలను అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సందర్శించారు. మౌలిక వసతులను పరిశీలించిన ఆమె మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆమెవెంట ఎంపీడీవో రాజేశ్వర్, సర్పంచులు సంజీవ్, గంగాధర్, అనసూయ, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.