హస్తినలో టీఆర్ఎస్ కార్యాలయానికి నేడు కేసీఆర్ భూమిపూజ
దేశ రాజధానిలో రెపరెపలాడనున్న గులాబీ జెండా
జెండా పండుగతోపాటే పార్టీ సంస్థాగత నిర్మాణం
చారిత్రక అధ్యాయానికి పార్టీ అధినేత శ్రీకారం
ఢిల్లీకి పయనమైన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు
రెండు దశాబ్దాల ప్రస్థానంలో స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడిన టీఆర్ఎస్.. మరో మైలురాయిని దాటబోతున్నది. ఢిల్లీలో గులాబీదళపతి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ భవన్‌కు నేడు పునాదిరాయి పడనున్నది. దీంతోపాటు జెండాపండుగను గురువారం ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నది. రానున్న 20రోజులపాటు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నూతన కమిటీలను నియమించనున్నది.
గుబాళిస్తున్న గులాబీ పార్టీ
నిజామాబాద్, సెప్టెంబర్ 1, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండు దశాబ్దాల ప్రయాణంలో స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి బంగారు తెలంగాణ వైపు పయనిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు మరో మైలురాయిని దాటబోతున్నది. దేశ రాజధానిలో టీఆర్ఎస్ కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకు ముందడుగు పడింది. గులాబీ దళపతి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ భవన్‌కు నేడు ఢిల్లీలో పునాది రాయి పడబోతున్నది. పదిహేనేండ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టేవిధంగా, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తెలంగాణ భవన్ ఇప్పుడు ఢిల్లీలోనూ తెలంగాణ ప్రజల గౌరవాన్ని నిలబెట్టే విధంగా నిలబడనున్నది. మరోవైపు నేటి నుంచి వరుసగా 20 రోజులపాటు తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో నూతన కమిటీలను నియమించనున్నది. అధినేత కేసీఆర్ ఆదేశాలతో జిల్లాల వారీగా పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక సైతం 20వ తేదీ అనంతరం జరుగనుంది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నేడు(గురువారం) పార్టీ జెండాపండుగ జోరుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమి పూజా కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే పయనమయ్యారు.
చారిత్రక సందర్భమిదీ…
హైదరాబాద్‌లో 2006లో తెలంగాణ భవనాన్ని నిర్మించుకున్న టీఆర్ఎస్, ప్రజల ఆదరాభిమానాలతో 33 జిల్లాల్లోనూ నూతనంగా పార్టీ జిల్లా కార్యాలయాలను నిర్మించింది. ఇదే సమయంలో ఢిల్లీ గడ్డపై స్వాభిమానాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మాభిమాన పతాకను ఎగరవేయబోతున్నది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరగబోయే గులాబీ పండుగ యావత్ తెలంగాణ సమాజానికి, టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు సంబురం లాంటిదే. సెప్టెంబర్ 2న ఢిల్లీలో నిర్మాణం ప్రారంభించుకోనున్న తెలంగాణ భవన్ మరో చరిత్రకు నాందిగా మిగులుతుందనడంలో సందేహం లేదు. పనిచేసే ప్రభుత్వానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన కేంద్ర సర్కార్ తెలంగాణను కనీసం పట్టించుకోవడం లేదు. సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఒక జాతి ఏకతాటిపైకి వచ్చి ఒక రాజకీయ పార్టీని సొంతం చేసుకోవడం ఒక చారిత్రక సన్నివేశమే. నిద్రాణంగా ఉన్న స్వరాష్ట్ర ఆకాంక్షలను ముక్కోటి గొంతుకల్లో మార్మోగించారు. తెలంగాణ యావత్ సమాజాన్ని సమన్వయంతో ఉద్యమ పంథాన నడిపించారు. రాష్ట్ర సాధనలో తెలంగాణ భవన్ నిర్మాణం, తర్వాత దాని పాత్ర అనిర్వచనీయం. అది భావ సారూప్యత కలిగిన ప్రతి ఒక్కరికీ వేదికగా నిలిచింది. ఉద్యమ వ్యూహాలకు పదును పెట్టింది. రెండంతస్తుల ఈ ఆత్మాభిమాన ప్రతీక నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల శాశ్వత చిరునామాగా నిలిచింది.
నెలాఖరులో పదవుల భర్తీ…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. రెండేళ్లుగా నిలిచిన కమిటీల కూర్పును మరోసారి పకడ్బందీగా చేపట్టనున్నారు. సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామ, వార్డుల కమిటీలు, 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మండల కమిటీలను ఎన్నుకోనున్నారు. గ్రామస్థాయిలో 15 మంది సభ్యులకు చోటు ఇచ్చే అవకాశం ఉంది. అందులో కచ్చితంగా 8 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలుండాలి. దీంతో పాటుగా 11 మందితో అనుబంధ కమిటీలైన విద్యార్థి, యువజన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్, కార్మిక, రైతు విభాగం, సోషల్ మీడియా తదితర అనుబంధ సంఘాలకు సభ్యులతో పాటు అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకుంటారు. మండల, జిల్లా కమిటీలను ఇదే తరహాలో ఎన్నుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 20వ తేదీలోగా ప్రక్రియను ముగించాలని టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలిచ్చింది. నెలాఖరులోగా జిల్లా అధ్యక్షుడిని గులాబీ అధినేత కేసీఆర్ ఖరారు చేయనున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం పాటుపడుతున్న సీనియర్లు, ఉద్యమకారులు ఈ అధ్యక్ష పదవిని అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
జెండా పండుగను ఘనంగా నిర్వహించాలి
బాన్సువాడ, సెప్టెంబర్ 1: టీఆర్ఎస్ జెండా పండుగను నేడు గురువారం ఘనంగా నిర్వహించాలని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు పార్టీ మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు జెండాను ఎగురవేయాలని సూచించారు.
ఢిల్లీకి పయనం..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీ బాట పట్టారు. హైదరాబాద్ నుంచి ప్రజా ప్రతినిధులంతా విమానంలో ఢిల్లీకి ఇప్పటికే చేరుకున్నారు. గురువారం నిర్వహించే పార్టీ కార్యాలయ భవన నిర్మాణ కార్యక్రమంలో అధినేత కేసీఆర్‌తో కలిసి నేతలంతా పాల్గొననున్నారు. చారిత్రక ఘట్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో ఈ అరుదైన సందర్భంలో పాలుపంచుకునేందుకు చాలా మంది శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సైతం పయనమయ్యారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ అహ్మద్, ఎంపీ బీబీ పాటిల్, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబొద్దీన్ తదితరులు తెలంగాణ భవన్ నిర్మిత ప్రాంతంలో బుధవారం స్థలాన్ని సందర్శించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.