ఉమ్మడి జిల్లాలో రెపరెపలాడిన టీఆర్ఎస్ జెండా
అధిష్టానం పిలుపుతో అట్టహాసంగా జెండాపండుగ నిర్వహణ
పల్లె, పట్టణాల్లో పతాకావిష్కరణ చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు
మారుమోగిన ‘జై తెలంగాణ.. జై జై కేసీఆర్’ నినాదాలు
టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణానికి కార్యాచరణ షురూ..
ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణానికి అధినేత కేసీఆర్ శంకుస్థాపన
భూమిపూజను టీవీల్లో వీక్షించిన టీఆర్ఎస్ శ్రేణులు..
దేశ రాజధానిలో తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన.. గల్లీ గల్లీల్లో జెండా పండుగ.. గురువారం అట్టహాసంగా జరిగాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఊరూరా టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. పార్టీ శ్రేణులు పతాకావిష్కరణలో భాగమయ్యాయి. ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉద్యమ పార్టీగా రెండు దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన టీఆర్ఎస్ నేడు రాజకీయ శక్తిగా ఎదిగి దేశరాజధానిలో తన అస్థిత్వ పతాకను సగర్వంగా ఎగరేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు సైతం దేశ రాజధానికి వెళ్లి ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వాములయ్యారు.
నిజామాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి భవన నిర్మాణానికి భూమి పూజ దేశ రాజధానిలో గురువారం అట్టహాసంగా జరిగింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా శాస్ర్తోక్తకంగా శంకుస్థాపన మహోత్సవాన్ని సందడి వాతావరణంలో నిర్వహించారు. ఢిల్లీ మహానగరంలోని వసంత్ విహార్‌లో తెలంగాణ భవన్ నిర్మాణాన్ని టీఆర్ఎస్ చేపడుతున్నది. ఉద్యమ పార్టీగా సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన టీఆర్ఎస్.. నేడు రాజకీయ పార్టీగా ఎదిగింది. ప్రజల మన్ననలు పొందుతూ ఢిల్లీ దాకా చేరింది. ఈ అపురూప ఘట్టంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక రోజు ముందే ఢిల్లీకి చేరుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ ఛైర్మన్లు సైతం దేశ రాజధానికి వెళ్లి చరిత్రక సందర్భంలో పాత్రులయ్యారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 2 నుంచి టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టాలనే గులాబీ పార్టీ కార్యాచరణ అమల్లోకి వచ్చింది. తొలి రోజు ఊరూరా శ్రేణులంతా టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. పల్లె, పట్టణం తేడా లేకుండా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున జెండా పండుగలో పాల్గొన్నారు.
ఆవిష్కృతమైన చారిత్రక ఘట్టం..
2006లో హైదరాబాద్‌లో తెలంగాణ భవన్ నిర్మాణానికి పునాది రాయి పడగా.. దశాబ్దంన్నర కాలానికి ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ కార్యాలయానికి శంకుస్థాపన జరిగింది. రెండు దశాబ్దాల కాలంలో టీఆర్ఎస్ గొప్పశక్తిగా ఎదిగి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ నినాదంగా మారింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపన మహోత్సవాన్ని అధినేత కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు భారీగా ఢిల్లీకెళ్లారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, షకీల్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావుతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో పాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు హాజరయ్యారు. శాస్ర్తోక్తకంగా జరిగిన భూమి పూజా కార్యక్రమాన్ని టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు టీవీల్లో చూసి పరవశించారు.
ఊరూరా జెండా పండుగ..
రెండేండ్ల అనంతరం సంస్థాగత నిర్మాణంపై గులాబీ పార్టీ దృష్టి సారించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ ధ్వర్యంలో పార్టీ కార్యవర్గాల కూర్పు కొనసాగనున్నది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీ లు, అనుబంధ విభాగాలను ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇప్పటికే పార్టీ షెడ్యూల్‌ను ప్రకటించింది. గురువారం నిర్వహించిన జెండా పండుగ కార్యక్రమంతో సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణ అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో గులాబీ శ్రేణులంతా టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. గద్దెలకు రంగులు అద్ది, శోభాయమానంగా తీర్చిదిద్ది పార్టీ జెండాను ఆవిష్కరించారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లోని వార్డులు, డివిజన్ కేంద్రాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జెండాను ఎగురవేశారు. ఓ వైపు ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ ఘనంగా జరుగగా.. ఉమ్మడి నిజామాబాద్‌లో టీఆర్ఎస్ జెండా పండుగ సైతం సంబురంగా పూర్తయ్యింది.
పార్టీ పదవులపై ఆసక్తి..
ఉద్యమానికి ఊపిరిలూదిన గడ్డగా పేరొందిన ఉమ్మడి జిల్లాలో ఊరూరా, వాడవాడలా పార్టీ జెండా పండుగ సందడి వాతావరణంలో నిర్వహించారు. వార్డుస్థాయి నుంచి మొదలు జిల్లాస్థాయి వరకు ఘనంగా చేపట్టారు. జెండా పండుగ కార్యక్రమం పూర్తి కావడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుక్రవారం నుంచి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అధిష్టానం ఆదేశాలతో 12వ తేదీ వరకు గ్రామ, వార్డు కమిటీలను నియమించనున్నారు. స్థానిక నాయకులను సమన్వయం చేసుకొని పార్టీ కోసం శ్రమిస్త్తున్న వారికే పదవులు కట్టబెట్టనున్నారు. 12 నుంచి 20వ తేదీ వరకు మండల కమిటీలు కూర్పు ఉండనున్నది. వీటితో పాటే అనుబంధ విభాగాల ఎంపిక కూడా చేపట్టనున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎవరు నియమితులవుతారనే చర్చ ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు వేర్వేరుగా అధ్యక్షులను నియమించనున్న నేపథ్యంలో ఉద్యమంలో పాల్గొని, పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారంతా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎవరెవరికి ఏ పదవులు వరిస్తాయోనన్న ఆసక్తి టీఆర్ఎస్ శ్రేణుల్లో మొదలైంది.