విద్యానగర్, మార్చి 17 : ధరణి టౌన్‌షిప్‌లోని ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం వచ్చిందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. కామారెడ్డిలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో గురువారం ధరణి టౌన్ షిప్ ప్లాట్ల వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 230 ప్లాట్లకు వేలం నిర్వహించగా 217 ప్లాట్లు విక్రయించినట్లు చెప్పారు. మొదటి రోజు 62, రెండో రోజు 70, మూడో రోజు 40, నాలుగో రోజు 45 ప్లాట్లు విక్రయించినట్లు పేర్కొన్నారు. 13 ప్లాట్ల కొనుగోలుకు కొనుగోలుదారులు ముందుకు రాలేదని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఆర్డీవో శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ నెలాఖరులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను పూర్తిచేయాలి
కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయంలో రైస్‌మిల్లుల యజమానులతో యాసంగి ధాన్యం మిల్లింగ్‌పై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. లక్ష్యానికి అనుగుణంగా రైసు మిల్లుల వారీగా జరిగిన మిల్లింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో నిజామాబాద్ ఎఫ్‌సీఐ డివిజనల్ మేనేజర్ రిజ్వాన్ అహ్మద్, ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి రాజశేఖర్, సివిల్ సైప్లె డీఎం జితేంద్రప్రసాద్, ఆర్డీవోలు శ్రీను, రాజాగౌడ్, రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి గౌరీశంకర్, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
కరపత్రాల ఆవిష్కరణ
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రత్యేకతలు, విశిష్టతను తెలిపే కరపత్రాలను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆవిష్కరించారు. ఆరు దశాబ్దాలుగా కామారెడ్డిలోని డిగ్రీ కళాశాల చేస్తున్న కృషిని, కళాశాలలో ఉన్న వసతులు వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను చూసి యాజమాన్యాన్ని అభినందించారు. న్యాక్ పర్యటన సందర్భంగా కళాశాల అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కిష్టయ్య, వైస్ ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.
పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలి
12 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో జూమ్ కాన్ఫరెన్స్‌లో వైద్యాధికారులతో సమీక్షించారు. పీహెచ్‌సీల్లో తల్లిదండ్రులు పిల్లలను పీహెచ్‌సీలకు తీసుకెళ్లి వే యించాలని సూచించారు. ఇన్చార్జి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శోభారాణి, వైద్యులు పాల్గొన్నారు.