ఖలీల్వాడి, అక్టోబర్ 9 : ప్రస్తుత కాలంలో చాలా మంది అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, తీవ్ర పని ఒత్తిడి తదితర కారణాలతో మానసిక సమస్యల బారిన పడుతున్నారు. ఇటువంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కనీసం కుటుంబ సభ్యులతో సైతం గడపలేని దయనీయ పరిస్థితి. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఇందు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని అక్టోబర్ 10న జరుపుకోవాలని ప్రకటించింది. రకరకాల లక్షణాలతో చాలామంది మానసికవ్యాధులకు గురవుతుంటారు. భావోద్వేగ ఫిట్నెస్, మానసిక ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలని మానసికంగా చాలామంది బాధపడుతుంటారు. ఆరోగ్యం శ్రేయస్సును మెరుగుపరుచుకోవాడానికి డాక్టర్ల సలహాలు తీసుకోవాలి. లేదంటే ప్రతికూల భావోద్వేగాలు విజయాలను నిరోధిస్తాయి.
మానసిక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే..
మానసిక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్స మధ్యలోనే ఆపేసినా పరిస్థితి మరింత అదుపు తప్పే ప్రమాదం ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. దీర్ఘకాలిక శారీరక సమస్యలు కొన్ని సార్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక అనారోగ్యం శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కనుక అటు శారీరకంగా, ఇటు మానసికంగా దృఢంగా ఉండేలా చూసుకోవాలి.
మానసిక అనారోగ్యం లక్షణాలు
ఆందోళన.. గుండెలో భయం, దడ – ఊపిరి ఆడకపోవడం- కడుపులో వికారం – గొంతు పట్టేసినట్లు అనిపించడం- ఛాతి నొప్పి, నోరు, గొంతు ఎండిపోవడం- ప్రాణం పోతుందేమోన్న భయం
పిల్లల ప్రవర్తనలో సమస్యలు
బుద్ది మాంద్యం- ప్రవర్తనా లోపాలు – చదువులో వెనుకబడుట- నత్తి, పక్కతడపడం- రకరకాల భయాలు- నిద్ర, ఆహార సమస్యలు
ఓసీడీ
పదేపదే అపరిశుభ్రమైన ఆలోచనలు రావడం-అదే పనిగా చేతులు కడగడం, తుడవడం, తాళాలు వేశామో లేదోనని చూడడం- చేసిన పని పదే పదే చేయడం- ముట్టిందే ముట్టడం
డిప్రెషన్
మనసులో బాధ ఆత్మన్యూనత- శ్రద్ధ, ఏకాగ్రత లోపించడం- నిద్ర, ఆకలి తగ్గడం నెగిటివ్ ఆలోచనలు- ఒంట్లో రకరకాల నొప్పులు-
మానియా
గొప్పగా భావించుకోవడం – ఉద్రేకం, తిట్టడం, కొట్టడం, విచ్చలవిడి ఖర్చు- అతి సంతోషం- నిద్రలేమి- సెక్స్ కోరికలు పెరగడం
ఆత్మహత్య
జీవితంపై విరక్తి చెందడం, క్షణికావేశం- చనిపోవాలన్న ఆలోచనలు రావడం – మనం కోరుకున్నది దూరమైనప్పుడు ఆవేశం కలగడం- దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఆత్మహత్య ఆలోచనలు
సైకోసిస్
విచిత్రమైన అనుమానాలు అపనమ్మకాలు – భయాలు, భాంత్రులు- ఎవరూ లేకపోయిన చెవుల్లో శబ్దాలు వినబడడం- తనలోతాను మాట్లాడడం, నవ్వడం- ఎవ్వరితోనూ కలువకపోవడం, ఏ పని చేయకపోవడం
దీర్ఘకాలిక నరాల నొప్పులు
ఎన్ని మందులు వాడినా తగ్గని నొప్పులు- మంటలు , పోట్లు తిమ్మిర్లు – కండరాలు గుంజుకురావడం
హిస్టీరియా
కండ్లు తిరగడం కిందపడిపోవడం- ఫిట్స్ ,తిమ్మిర్లు- మంటలు, పోటు,్ల కండరాలు గుంజుకుపోవడం, అదేపనిగా ఎక్కిళ్లు, తుమ్ములు రావడం- పూనకాలు రావడం
దుర్వ్యసనాలు
ఆల్కహాల్ గుట్కా, సిగరెటు, గంజాయి- నిద్రమాత్రలు, మత్తు పదార్ధాలకు అలవాటు కావడం
డిల్యూజన్ డిజార్డర్
భార్య, భర్త శీలాన్ని శంకించడం- తనకు ఫలానా వ్యాధి ఉందని అపనమ్మకం.
చికిత్సతో విముక్తి
ఇలా మానసిక వ్యాధితో ఎంతో మంది బాధపడుతుంటారు. మరికొందరు బయటికి చెప్పకుండా వారిలోనే వారు కుమిలిపోతుంటారు. అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఒక్కటే. మానసిక వైద్యనిపుణులను కలిసి సమస్యలను చెప్పి కోర్సు వాడితే ఫలితం ఉంటుంది.
సులభంగా జయించొచ్చు
ఎంతటి సమస్యనైనా మానసిక వైద్యనిపుణులను సంప్రదించి వారి సలహాలు, సూచనల మేరకు వ్యాధిని అరికట్టవచ్చు. సమస్య తీవ్రత పెరగకముందే వైద్యులను సంప్రదించడం మంచింది. ప్రతి ఒక్కరూ ఒత్తిడికి దూరం కావాలి. ప్రశాంత జీవనాన్ని అలవర్చుకోవాలి.
-డాక్టర్ విశాల్, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు