నేటి నుంచి విద్యాసంస్థల పునః ప్రారంభం
ఏడాదిన్నర విరామం తర్వాత తెరుచుకోనున్న బడులు
గురుకులాలు మినహా అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో నిర్ణయం
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహణఏడాదిన్నర విరామం తర్వాత బడిగంట మోగనున్నది. కరోనా కారణంగా గతేడాది మార్చిలో పాఠశాలలు మూతపడగా.. అప్పటినుంచీ విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు. కొంతకాలంగా ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. కొవిడ్ వ్యాప్తి నియంత్రణలోకి రావడంతో బుధవారం నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో గురుకులాలు మినహా అన్ని విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి.
విద్యానగర్/ ఆర్మూర్, ఆగస్టు 31: నేటి నుంచి బడిగంట మోగనున్నది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడగా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ తరగుతులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి నియంత్రణలోకి రావడంతో బుధవారం నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. రెసిడెన్షియల్, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, గిరిజన సంక్షే మ పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలను కొవిడ్ నిబంధనల మేరకు తెరిచేందుకు కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేటి నుంచి కేజీ నుంచి పీజీ వరకు, అంగన్వాడీ మొదలు అన్ని పాఠశాలలు యథావిధిగా కొనసాగనున్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆన్లైన్, ఆఫ్లైన్ తరగతులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్థులను పాఠశాలలు బలవంతపెట్టొదని ఆదేశించింది. ఆన్లైన్, ప్రత్యక్ష బోధన అంశంపై పాఠశాలలదే నిర్ణయమని పేర్కొంది. గురుకులాల్లో మాత్రం హైకోర్టు ఆదేశాలకనుగుణంగా నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో బుధవారం నుంచి విద్యాసంస్థలు కొనసాగనున్నాయి. తరగతి గదులు, ఆవరణ, మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్నారు. ఐదు నెలల క్రితం వరకు 9,10 ఆ పై తరగతులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించగా.. మిగతావారు సుమారు ఏడాదిన్నరగా ఇంట్లోనే చదువులు కొనసాగిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.విద్యార్థులు స్కూళ్లకు వచ్చేలా చూసే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించడంతో ఈ మేరకు వారు చర్యలు తీసుకుంటున్నారు. ఇక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం ముందస్తుగానే బియ్యం పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే అన్ని పాఠశాలలకు బియ్యాన్ని సరఫరా చేసింది. ఐదు రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామ పంచాయితీ పరిధిలో పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయడంలో నిమగ్నమయ్యారు. తరగతి, వంట గదులను, టాయ్లెట్ గదులు శుభ్రం చేసి, తాగునీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ప్రతి తరగతిని సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేయించారు.
క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ.. పరిశీలన
పాఠశాలలు ప్రారంభం నేపథ్యంలో జిల్లా అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పాఠశాలలో కావాల్సిన మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు. పాఠశాలలను సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అధికారులు సూచనలు చేశారు. కరోనా నేపథ్యంలో సుమారు 18 నెలల తరువాత పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాల వారీగా స్కూళ్ల వివరాలు
కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 1259 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు 23, జడ్పీపాఠశాలలు 988,కేజీబీవీలు 19, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ 1,టీఎస్ మోడల్ స్కూ ళ్లు 6, ఎయిడెడ్ పాఠశాలలు 5,తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ 1,సోషల్ వెల్ఫేర్ సొసైటీ స్కూళ్లు 11, ట్రైబల్ వెల్ఫేర్ సోసైటీ స్కూళ్లు 3,ఆశ్రమ పాఠశాలలు 3, మినీ గురుకులం స్కూళ్లు 2, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్కూళ్లు 7, నవోదయ విద్యాలయం 1, బీసీ వెల్ఫేర్ స్కూళ్లు 7, మైనార్టీ వెల్ఫేర్ 6, తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు 1, ప్రైవేట్ పాఠశాలలు 175 ఉన్నాయి.జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 10 వ తరగతి వరకు 1,49,447 మంది విద్యార్థులు ఉన్నారు.
నిజామాబాద్ జిల్లాలో 1759 పాఠశాలలు
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్, కేంద్రీయ విద్యాలయం, మైనార్టీ వెల్ఫేర్ మొత్తం కలిపి 1759 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 2,63,267 మంది విద్యార్థులు ఉన్నారు.
పాఠశాలలను సిద్ధం చేశాం
ప్రత్యక్ష తరగతులను ప్రారం భించేందుకు జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేర కు పాఠశాలలోని పరిసరా ల శుభ్రతతోపాటు తరగతి గదులను శానిటైజ్ చే యించాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
-రాజు, కామారెడ్డి డీఈవో హాస్టల్స్ మూసివేత
నిజామాబాద్ సిటీ, ఆగస్టు 31: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభిస్తున్నాం. ఇప్పటికే ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిసరాలు, తరగతి గదులను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించే హాస్టళ్లకు అనుమతి ఇవ్వలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వాటిని మూసి ఉంచాలి.
-దుర్గాప్రసాద్, నిజామాబాద్ డీఈవో