నిజామాబాద్ రూరల్/ ఇందల్వాయి, జనవరి 28: విజయ డెయిరీకి పాలు పోసే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజయ డెయిరీ జనరల్ మేనేజర్ మల్లయ్య పిలుపునిచ్చారు. తిర్మన్‌పల్లి, ఇందల్వాయి, వెంగల్పాడ్, దుబ్బాక, సీతాయిపేట గ్రామాలకు చెందిన ఆరుగురు పాడి రైతులకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున మంజూరుకాగా, చెక్కులను సారంగాపూర్ విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ నందకుమారి, మేనేజర్ రమేశ్‌తో కలిసి ఆయన శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీఎం మల్లయ్య మాట్లాడుతూ విజయ డెయిరీకి పాలు పోసే రైతుల పిల్లల వివాహాలకు విజయ పెండ్లి కానుకగా రూ.5వేలు ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5వేలు ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో విజయ డెయిరీకి 3500 మంది పాడిరైతులు పాలు పోస్తున్నారని వివరించారు. ప్రైవేట్ సంస్థలకు పాలు పోయకుండా విజయ డెయిరీకి పాలు పోసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో విజయ డెయిరీ సూపర్వైజర్ బ్రహ్మానందం పాల్గొన్నారు. తిర్మన్‌పల్లి నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీటీసీ చింతల దాస్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్‌గౌడ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు షేక్ హుస్సేన్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు శెట్టి బిరీశ్ తదితరులు పాల్గొన్నారు.