పేదవర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య
తెలుగుతో సమానంగా ఆంగ్లంలో విద్యా బోధన
సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు
ప్రభుత్వ నిర్ణయాన్నిమనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం..
నమస్తే తెలంగాణ’తో గెజిటెడ్ హెచ్ఎంల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజగంగారెడ్డి
మాక్లూర్, జనవరి 28:పునాది బాగుంటే.. భవనం కలకాలం మన్నికగా ఉంటుంది. అలాగే ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్లంపై పట్టు సాధిస్తే భవిష్యత్తులో పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మనబడి పేరుతో గ్రామీణ విద్యార్థులకు సైతం ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తేవడం హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమంతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. తెలుగు మీడియం పాఠశాలలకు సమానంగా.. ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటున్నారు గెజిటెడ్ హెచ్ఎంల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజగంగారెడ్డి. మన ఊరు – మన బడిపై ‘నమస్తే’తో పలు విషయాలు పంచుకున్నారు.
నమస్తే: మన ఊరు..మన బడిని స్వాగతిస్తున్నారా?
రాజగంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు..మనబడి కార్యక్రమాన్ని గెజిటెడ్ హెచ్ఎంల అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. కార్పొరేట్ పాఠశాలల కన్నా మెరుగైన రీతిలో ప్రభుత్వ బడులు మారుతాయి. ఎంపిక చేసిన పాఠశాలలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులందరికీ ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి వస్తుంది. మన ఊరు- మన బడి కార్యక్రమం ఉపాధ్యాయులందరికీ తీపి కబురుగా చెప్పవచ్చు.
పీఆర్టీయూ ఆధ్వర్యంలోఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారా?
పీఆర్టీయూ ఆధ్వర్యంలో మాక్లూర్ మండలం వెంకటాపూర్, వల్లభపూర్ గ్రామాల్లోని పాఠశాలలకు బెంచీలు, కంప్యూటర్లు, టాయిలెట్లకు నిధులు అందజేశాం. వీడీసీల సహకారంతో చిక్లి, మాదాపూర్, ఒడ్యాట్పల్లి, గుంజిలి పాఠశాలలను ఈ సంవత్సరం ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా ఏర్పాటు చేశాం. మన ఊరు.. మన బడితో మొత్తం 58 పాఠశాలలు ఇంగ్లిష్ మీడియంలోకి మారడం చాలా ఆనందంగా ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. వేలకు వేలు ఫీజులు కట్టలేని విద్యార్థులకు భారం తగ్గుతుంది. ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య లభిస్తుంది.
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతాయా?
ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక దేవాలయాలుగా మార్పు చెందే అవకాశం ఉంది. వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు. శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది. మన ఊరు..మనబడి ద్వారా ప్రభుత్వ నిధులు సమకూరుతాయి. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నా రు. దాతల సహకారంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతాయి. ఉదాహరణకు మాక్లూర్ ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణకు బిగాల క్రిష్ణమూర్తి పేరుతో వారి తనయులు గదుల నిర్మాణానికి కోటి రూపాయలు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడులు సుందరంగా తీర్చదిద్దబడుతాయి.
ఎటువంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి?
మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మౌలిక వసతులు పూర్తిగా ఏర్పాటవుతాయి. రాష్ట్రం వ్యాప్తంగా ఒకేసారి కాకుండా దశల వారీగా అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాల కల్పన జరుగుతుంది. పాఠశాలలకు నిధులు కేటాయించబడుతాయి. అరకొర వసతులు పూర్తిగా తొలగిపోతాయి. సమస్యలతో సతమతమవుతున్న పాఠశాలలకు మన ఊరు.. మన బడితో పూర్తిస్థాయిలో నిధులు మంజూరవుతాయి. ఇందు లో ఎలాంటి సందేహం లేదు.
విద్యారంగంలో ఎటువంటి మార్పులు వస్తాయి?
మన ఊరు మన బడితో విద్యారంగం కచ్చితంగా బలోపేతం అవుతుంది. విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉపాధ్యాయుల కొరత తీరుతుంది. నూతనంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయి. కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య లభిస్తుంది. డిజిటల్ తరగతులు, కంప్యూటర్లాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల పాఠశాలలు బలోపేతమవుతాయి.