ఈ సారి నిజామాబాద్ జిల్లాలో అటవీశాఖ లక్ష్యం 59.20 లక్షలు
ఇప్పటికే 40.99 లక్షలు పూర్తి
గ్రామాల్లో జోరుగా మొక్కలు నాటే కార్యక్రమం
జాతీయ రహదారులు, ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా హరితహారం
అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లోనూ మొక్కలను నాటుతున్న అధికారులు
అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని పెంచుతున్న యంత్రాంగం
నిజామాబాద్, ఆగస్టు 6, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఏడోవిడుతలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటుతూ ముందుకు సాగుతున్నారు. నాటిన మొక్కలను తొలగిస్తే నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కఠినచర్యలు తప్పవని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో 59.20 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 40.99 లక్షల మొక్కలను నాటారు. ప్రధానంగా అటవీ భూముల్లో ఖాళీ ఏర్పడినచోట ఆరు అడుగుల మొక్కలను నాటేందుకు ఫారెస్టు సిబ్బంది ప్రాధాన్యమిస్తున్నారు. జాతీయ రహదారులు-44, 63 వెంట అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా పెద్దసంఖ్యలో మొక్కలను నాటుతూ సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో 267 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా 28,276 గుంతలు తవ్వి మొక్కలను నాటారు.
తరిగిపోతున్న అడవులను 33 శాతానికి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఏడో విడుత హరితహారం ముమ్మరంగా సాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని 29 మండలాల్లో 530 గ్రామ పంచాయతీల్లో ఒక్కో జీపీలో వేలాది మొక్కలను నాటుతున్నారు. అటవీ భూములు, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, రహదారులు, పొలం, కాలువగట్లు, ఆలయాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేలా ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వం ముందుకు సాగుతు న్నది. గ్రామాల్లో ప్రతి ఇంటికీ కనీసం ఆరు మొక్కలు పంపి ణీ చేసి నాటిస్తున్నారు. గ్రామాల్లో నాటిన మొక్కలను పం చాయతీ కార్యదర్శులు పకడ్బందీగా పర్యవేక్షించేలా చూస్తు న్నారు. నాటిన మొక్కలను ఎవరైనా తొలగిస్తే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు అవుతాయి.. వ్యవసాయ భూ ముల్లో, మరే ఇతర ప్రాంతాల్లో గానీ నాటిన మొక్కలను తొలగించినా, కాల్చివేసినా అలాంటి వారిపై ఇక నుంచి కఠి న చర్యలు తప్పవన్న సంకేతాలు పంపిస్తున్నారు. మొక్కల పెంపకం అన్నది సామాజిక బాధ్యత. అడవులను రక్షించుకోవడం, కొత్తగా వనాలను పెంచుకుంటేనే భావితరాలు బతుకుతాయి. లేదంటే మానవ సమాజానికి భవిష్యత్తు ఉండదనే సందేశాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తున్నది.
అటవీ శాఖ లక్ష్యం 69శాతం పూర్తి…
హరితహారం కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఏడో విడుత కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ టార్గెట్ ప్రకారం 59.20 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా ఇప్పటి వరకు 40.99 లక్షలు నాటినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం లక్ష్యంలో దాదాపుగా 69.20శాతం మేర మొక్కలు నాటారు. 29 మండలాల్లో ఆయా శాఖల అధికారుల ఆధ్వర్యంలోనూ మొక్క లను నాటే కార్యక్రమం ఉధృతంగా సాగుతున్నది. ప్రధానంగా అటవీ భూముల్లో ఖాళీ ఏర్పడిన చోట ఆరు అడుగుల మొ క్కలను నాటేందుకు ఫారెస్టు సిబ్బంది ప్రాధాన్యతను ఇస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల జోలికి వెళ్లకుండా ఆక్రమిత భూముల్లో మొక్కలు నాటి అటవీవృద్ధికి కృషి చేస్తున్నారు. భిన్నమైన జాతుల మొక్కలను ఆయా చోట్ల పెద్ద సంఖ్యలో నాటేలా చూస్తున్నారు. గతంలో మాదిరిగా మొక్కలు నాటే కార్యక్రమంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ప్రతి కార్యక్రమంలోనూ కలెక్టర్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటవీ శాఖకు సైతం పకడ్బందీ ఆదేశాలిచ్చారు. ఇతర శాఖల సి బ్బందిని, ప్రజలను, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు. ఏడో విడుత కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన ఆవశ్యకతను, చట్టంలోని కఠినమైన నిబంధనలను కలెక్టర్ స్వయంగా వివరిస్తున్నారు.
అవెన్యూ ప్లాంటేషన్ ఇలా…
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులు అవెన్యూ ప్లాంటేషన్‌ను పెద్ద ఎత్తున చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44 వెంట మొక్కలు నాటేందుకు 46వేల 175 గుంతలు తీశారు. దాదాపు 75 కిలో మీటర్ల మేర జాతీయ రహదారికి ఇరువైపులా భారీగా మొక్కలు నాటారు. నేషనల్ హైవేపై అందుబాటులో ఉన్న స్థలాన్ని అనుసరించి నాలుగైదు వరుసల్లో మొక్కలు నాటా రు. జాతీయ రహదారి 63 వెంట 33వేల 86 గుంతలు త వ్వారు. 55కిలో మీటర్ల మేర ఇరువైపులా తవ్విన గుంత ల్లో మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. జా తీయ రహదారికి ఆనుకుని నిర్మించిన అప్రోచ్ రోడ్డు 75 కిలో మీటర్ల మేర అందుబాటులో ఉన్న స్థలంలోనూ భా రీగా హరితహారం ఏడో విడుతను విజయవంతంగా చేపట్టారు. ఈ ప్రాంతంలో 17,597 గుంతలు తవ్వి మొక్క లు నాటారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని 267 కిలో మీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా 28,276 గుంతలు తవ్వి మొక్కలు నాటారు. ఏడో విడుత హరితహారం కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలో 3,261 మంది వనసేవకులతో 530 జీపీల్లోని నర్సరీల్లో 97లక్షల 32 వేల మొక్కలను వృద్ధిలోకి తెచ్చి ప్రజలకు ఉచితంగా అందించారు.
సంరక్షణకు ప్రాధాన్యత…
ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. అడవులకు పూర్వ వైభవం తీసుకు రావాలని పరితపిస్తున్నది. హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. అయితే, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మొక్కలు నాటడంలో, నాటిన వాటిని కాపాడడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ పంచాయతీ రాజ్ చట్టంలో కొన్ని కఠినమైన అంశాలను పొందుపరిచారు. ఉద్యోగులు, సిబ్బంది మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే ఇక ఇంటికే పరిమితం చేస్తామని స్పష్టం గా చెప్పారు. ఈ ప్రభావం దాదాపు అన్ని శాఖలపై ఉంటుంది. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి నర్సరీలను ఏర్పాటు చేయించింది. అక్కడి నుంచి మొక్కలను పంపిణీ చేస్తున్నది. గ్రామాల్లో పెద్ద సంఖ్యలో నాటిస్తోంది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ వాటిని సంరక్షించే వారు కరువయ్యారు. ఫలితంగా బృహత్ లక్ష్యంతో అమలవుతున్న హరితహారంలోని మొక్కలు ఎండిపోతున్నాయి. నాటిన ప్రతి మొక్కకూ లెక్క ఉండాల్సిందే. వాటిని బతికించాల్సిన బాధ్యత కూడా పాలకులు, అధికారులు తీసుకోవాల్సిందే. నూతన పంచాయతీ రాజ్ చట్టంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఏడో విడుత హరితహారం జిల్లాలో జోరుగా సాగుతుండగా సంరక్షణకు పెద్ద ఎత్తున శ్రద్ధ తీసుకుంటున్నారు.