ఎల్లారెడ్డి రూరల్/తాడ్వాయి, ఫిబ్రవరి 14 : వాహనదారులు రోడ్డు నిబంధనలను తప్పక పాటించాలని సీఐ ఎన్.శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డి మండలకేంద్రంలోని జీవదాన్ హైస్కూల్లో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ విక్రమ్‌తో కలిసి రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను ధరించకుండా ప్రయాణించవద్దన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో జీవదాన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ థామస్, వైస్ ప్రిన్సిపాల్ జోబిష్, విద్యార్థులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలకేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఎస్సై కృష్ణమూర్తి, ఏఎంవీఐ అమృతవర్షిణి ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు, షీటీముల పనితీరు, సైబర్‌నేరాలపై విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం షీ టీములను ఏర్పాటు చేసిందని, ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై విద్యార్థులకు సూచించారు.
గండివేట్‌లో సైబర్ నేరాలపై..
గాంధారి, ఫిబ్రవరి 14: మండలంలోని గండివేట్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళాజాత బృందం సభ్యులు సైబర్ నేరాలపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాజాత బృందం సభ్యులు సైబర్నేరాలతోపాటు షీ టీముల ప్రాధాన్యత, ట్రాఫిక్ నిబంధనలు, మూఢ నమ్మకాలు, బాల్యవివాహాలు, చదువుకు ప్రాధాన్యత తదితర అంశాలపై ఆటపాటల రూపంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ అబ్దుల్ ఫారూక్, కళాజాత బృందం సభ్యులు ప్రభాకర్, సాయిలు, రవి, శేషు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.