అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ముగ్గురు మృతి చెందడం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. అందులో ఎస్సై, మహిళా కానిస్టేబుల్ ఉండడం పోలీసు వర్గాలను కలవరపాటుకు గురి చేసింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్ (33), బీబీపేటలో పని చేసే మహిళా కానిస్టేబుల్ కమ్మరి శ్రుతి (32), కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ (29) మృతదేహాలు పెద్దచెరువులో లభ్యమయ్యాయి. పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించక పోవడంతో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ఉదంతంలో వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని భావిస్తున్నప్పటికీ, ముగ్గురూ ఒకేసారి చనిపోవడంపై సందేహాలెన్నో వెల్లువెత్తుతున్నాయి. పెండ్లి చేసుకునే అంశంపై ముగ్గురి మధ్య వచ్చిన అభ్యంతరాలే ఇందుకు కారణమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోపోద్రిక్తులై ఒకరు చెరువులో దూకగా కాపాడే క్రమంలో ముగ్గురు మృతి చెందారా? లేక ఇద్దరిని చంపి మరొకరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? అన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి.
మెదక్ జిల్లాకు చెందిన సాయికుమార్‌ది పేద కుటుంబం. కష్టపడి పైకి వచ్చిన ఆయన ఎస్సైగా స్థిరపడ్డాడు. ఆయన భార్య గర్భవతి కాగా.. మూడేండ్ల కుమారుడు ఉన్నాడు. కిందిస్థాయి నుంచి ఎదిగిన అతడు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు, గాంధారి మండలం గుర్జాల్ గ్రామానికి చెందిన శ్రుతిది కూడా సాధారణ స్థాయి కుటుంబమే. 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికైన ఆమె గాంధారిలో ఆరేండ్లు, కామారెడ్డిలో సంవత్సరం పాటు పని చేసింది. గతంలోనే వివాహమై విడాకులు కూడా తీసుకున్న శ్రుతి మూడేండ్లుగా బీబీపేటలో విధులు నిర్వహిస్తూ తల్లిదండ్రులు యోగక్షేమాలు చూసుకుంటున్నది. సాయికుమార్ బీబీపేట ఎస్సైగా ఉన్న సమయంలోనే ఆమెతో పరిచయం ఏర్పడింది. అతడు బదిలీపై భిక్కనూరుకు వెళ్లగా, బీబీపేటకు చెందిన నిఖిల్‌తో శ్రుతికి సాన్నిహిత్యం పెరిగిందని తెలిసింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నిఖిల్ ఈమధ్యే బీబీపేట సొసైటీలో తాత్కాలిక ఉద్యోగిగా చేరాడు. వయస్సులో శ్రుతి కంటే చిన్నవాడైన అతడు ఆమెతో పెండ్లికి సిద్ధపడినట్లు తెలిసింది. బీబీపేట కేంద్రంగా మొదలైన పరిచయాల పర్వం.. ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది.
విధి నిర్వహణలో భాగంగా గురువారం మధ్యాహ్నం కాచాపూర్‌కు వచ్చిన ఎస్సై సాయికుమార్ ఆ తర్వాత అదృశ్యమయ్యారు. అదే సమయంలో బీబీపేట పోలీసుస్టేషన్లో విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన కానిస్టేబుల్ శ్రుతి కూడా కనిపించకుండా పోయింది. దీనిపై సమాచారమందుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా.. ఇద్దరు సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డి పెద్దచెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా ఎస్సై సొంత కారు, చెప్పులు, ఫోన్లు లభ్యమయ్యాయి. దీంతో గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలించగా, బుధవారం అర్ధరాత్రి శ్రుతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం సాయికుమార్ మృతదేహం లభించింది. మూడు మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించగా, పోస్టుమార్టం గది వద్ద పెను విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మధ్యాహ్నం తర్వాత పోస్టుమార్టం పూర్తి కావడంతో మృతదేహాలను వేర్వేరు అంబులెన్సుల్లో స్వగ్రామలకు తరలించారు. కుటుంబ సభ్యుల కన్నీటి రోదనల మధ్య గాంధారిలో శ్రుతి, బీబీపేటలో నిఖిల్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఉదంతంపై పోలీసు అధికారులు ఏమీ చెప్పడం లేదు. దీంతో ఎవరికి తోచింది వారు ఊహించుకుంటున్నారు. ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక వివరాలు చెబుతామని ఎస్పీ సింధూశర్మ తెలిపారు. భిక్కనూర్ ఎస్సై సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పెద్ద చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించి గాలించగా, మూడు మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ముగ్గురి మృతికి గల కారణాలు ఏమిటని చెప్పలేమన్నారు. పూర్తి విచారణ అనంతరం ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తామని తెలిపారు.
శ్రుతి కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్నట్లు తెలిసిన వారు చెబుతున్నారు. నిఖిల్‌తో పరిచయం ఏర్పడిన విషయం తోటి ఉద్యోగులతో పాటు చాలా మందికి తెలిసింది. ఈ విషయాన్ని బీబీపేట పోలీసులు గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే ప్రాణాలు పోయే వరకు వచ్చి ఉండేది కాదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. మరోవైపు సామాన్యప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలపై నిఘా పెట్టే పోలీసులు సొంత శాఖలోని సిబ్బంది వ్యవహారాలపై దృష్టి సారించక పోవడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే అనుకోని బలహీన క్షణాల్లో ఇతరత్రా కారణాలతో ప్రాణాలు తీసుకుంటుండం విస్మయాని గురి చేస్తున్నది.
సదాశివనగర్ సంచలనాలకు కేంద్రంగా నిలిచింది. గతంలో ఇదే ఠాణా పరిధిలో 2023 డిసెంబర్ 18న జంట హత్యల కేసు వెలుగు చూసింది. నాలుగైదు రోజులకు నిందితులను పట్టుకుని విచారిస్తున్న క్రమంలో వరుస హత్యలు వెలుగులోకి వచ్చాయి. భూంపల్లి గ్రామ పరిధిలో ఓ యువతిని దహనం చేసిన ఘటనపై కూపీ లాగగా ఆరుగురు అమాయకుల హత్యోదంతం బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటన డిసెంబర్ నెలలోనే చోటు చేసుకోగా, తాజాగా ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్ మరణాలు డిసెంబర్లోనే చోటు చేసుకోవడం గమనార్హం.
మా సాయి చాలా మంచోడు. నా చేతుల మీదుగానే పెరిగాడు. కష్టపడి సాయి పైకి వచ్చాడు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నిరంతరం తపించే వ్యక్తి. చెరువులో ఇద్దరు మునిగి పోతుంటే వారిని కాపాడే క్రమంలోనే సాయి కూడా ప్రాణాలు పోగొట్టుకున్నట్లు భావిస్తున్నాము. సాయికి మూడేండ్ల కుమారుడు, భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దని కోరుతున్నా.