కామారెడ్డి, జూన్ 19 :తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌ను గురువారం ముట్టడించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన కరువైందని, దీంతో కమిషనర్ చాంబర్‌ను ముట్టడించినట్లు తెలిపారు. నెలకు నాలుగు సెలవులు ఇవ్వాలని, ఆరోగ్యరీత్యా లేదా కుటుంబ సమస్యలతో ఉన్న కార్మికులకు బదిలీ అవకాశం కల్పించాలని, పాత కార్మికులను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ట్రాక్టర్, ఆటో డ్రైవర్లకు బీమా సౌకర్యం కల్పించాలని, వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని కోరారు. 60 ఏండ్లు నిండిన కార్మికుల కుటంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, మాట తప్పారని పేర్కొన్నారు. అనంతరం కమిషనర్ రాజేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజనర్సు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముదాం అరుణ్, యూనియన్ నాయకులు సంతోష్, దీవెన, శివరాజవ్వ, సావిత్రి, సులోచన, జ్యోతి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.