నిజామాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి జిల్లా విద్యాశాఖ పైరవీలకు అడ్డాగా మారింది. కొందరు ఉన్నతాధికారులే బరితెగిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. డిప్యుటేషన్ల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. డీఈవో ఆఫీస్‌లో జరుగుతున్న తంతుపై గతంలోనే కామారెడ్డి కలెక్టర్ విచారణ చేయించి అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేశారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలనూ చెత్తబుట్టలో వేయించారు. కలెక్టర్ కఠిన చర్యలు చేపట్టినప్పటికీ విద్యాశాఖలో ఏ మార్పూ కనిపించడంలేదు.
ఓ వైపు సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులంతా మూకుమ్మడిగా సమ్మెలో ఉండడంతో కేజీబీవీలు నడువడం లేదు. విద్యార్థులు నష్టపోతుంటే పట్టించుకోని ఉన్నతాధికారులు డిప్యుటేషన్ల తతంగానికి మాత్రం రాచబాటలు వేస్తున్నా రు. డిప్యుటేషన్ కోసం అర్రు లు చాస్తున్న టీచర్లకు డీఈవో కార్యాలయంలోనే కొంత మంది వక్రదారులను చూపిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. అధికార పార్టీ నేతలతో పైరవీ చేసుకుని డిప్యుటేషన్ తెచ్చుకునేందుకు చా లా మంది వరుస కడుతుండడం హాట్ టాపిక్‌గా మారింది.
ఎల్లారెడ్డి హైస్కూల్ నుంచి ఓ తెలుగు టీచర్‌ను రాజంపేట మండలానికి డిప్యుటేషన్ వేశారు. మండలం దాటి డిప్యూటేషన్‌ను అమలు చేశారు. ఇదే తరహా డిప్యుటేషన్లను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గతంలోనే రద్దు చేశారు. ఒకే మండలంలో సర్దుబాట్లు ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారుల పేరిట వచ్చిన ఆర్డర్లో కాపీలో మాత్రం సదరు ఉపాధ్యాయుడికి ఏ ప్రాతిపదికన డిప్యుటేషన్‌ను వర్తింపజేశారో పేర్కొనలేదు. సాధారణంగా డిప్యుటేషన్ అమలులో కుటుంబ, ఆరోగ్య సమస్యలను ప్రధాన అంశంగా పరిగణలోకి తీసుకుని మానవీయ కోణంలో సర్దుబాట్లు చేయడం పరిపాటి. కానీ హైదరాబాద్ ఉన్నతాధికారుల పేరిట జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం అదేదీ లేకపోవడం చర్చకు తావిస్తున్నది. చాలా మంది టీచర్లు వివిధ అవసరాల రీత్యా డిప్యుటేషన్లకు మొగ్గు చూపుతున్నారు.
పట్టణ ప్రాంతాలకు వచ్చేందుకు పోటీ పడుతున్నారు. విద్యాశాఖ డైరెక్టర్, కలెక్టర్ ఎవరైనా తమ స్థాయిలో నిబంధనలు అమలు చేయాల్సిందే తప్ప అతిక్రమించకూడదు. కామారెడ్డి వ్యవహారంలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తున్నది. ఉన్నతాధికారుల ఆదేశాలు రావడంతో ఎల్లారెడ్డిలో ఖాళీ అయిన పోస్టును మరొకరిని డిప్యుటేషన్ ద్వారా కామారెడ్డి విద్యాశాఖ అధికారులు సర్దుబాటు చేసినట్లు సమాచారం. 2021లో జారీ చేసిన జీవో నంబర్ 25 ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ప్రొసీడింగ్స్‌ను జారీ చేసింది. అవే నిబంధనలు డిప్యుటేషన్లకు వర్తిస్తాయంటూ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అమలు కావట్లేదు. ఇటీవల జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు డిప్యుటేషన్లకు సిఫార్సు చేయగా కలెక్టర్ వాటిని రద్దు చేశారు. 29 మంది ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్లు నిలిచి పోయాయి.
సుదీర్ఘ కాలంగా ఒకే ప్రాంతంలో పని చేస్తున్న విద్యాశాఖలోని కీలక అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది. నిజామాబాద్ డీఈవో అకస్మాత్తుగా బదిలీ వేటు వేసిన చందంగానే కామారెడ్డి జిల్లాకు సైతం వర్తించేలా బదిలీ ఉత్తర్వులను విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేశారు. నెలలు గడుస్తున్నా సదరు ఉన్నతాధికారి మాత్రం కామారెడ్డిని వదిలి వెళ్లలేదు. ఇదే విషయపై ఎవరైనా అడిగితే తనకు రిలీవర్ రావడం లేదంటూ చెబుతున్నారు. తన స్థానంలో ఎవరికైనా పోస్టింగ్ ఇస్తేనే తాను వెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెబుతుండడం గమనార్హం. ఉన్నతాధికారిని ప్రభుత్వం బదిలీ చేసి మరొకరికి ఈ స్థానాన్ని కేటాయించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
వివాదాస్పద వ్యక్తితో తప్పుడు పనులు చేయించుకునేందుకే ఇలా చేసినట్లు టీచర్లలో చర్చ జరుగుతున్నది. ఒక వ్యక్తిని ఆరేళ్ల పాటు ఒకే జిల్లాలో ఒకే పోస్టులో కొనసాగించడంపై తీవ్ర విమర్శలున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బదిలీకి రంగం సిద్ధమైనప్పటికీ ఎన్నికల కోడ్ మూలంగా నిలిచింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలే అడ్డుపుల్లలు పెట్టి సాంకేతిక కారణాలతో వివాదాస్పద అధికారికి అండగా నిలుస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఓ ఉపాధ్యాయ సంఘం నేతలు కూడా ఈ వివాదాస్పద అధికారికి అండగా నిలుస్తున్నట్లు ప్రచారం ఉన్నది.