నస్రుల్లాబాద్, ఆగస్టు 20 : నస్రుల్లాబాద్ మండలంగా ఏర్పాటు అయిన నాటి నుంచి అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో మండలంగా ఏర్పాటు అయిన కొంత కాలానికే గిరిజన బాలుర గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ.ఎనిమిది కోట్లు కేటాయించారు. దీంతో మండల కేంద్రంలో ప్రజలతోపాటు వ్యాపార సముదాయాలు పెరిగాయి. గతంలో ఉన్న ఉమ్మడి బీర్కూర్ మండల కేంద్రానికి దూరంగా ఉన్న హాజీపూర్, సంగం, అంకోల్ తండాలకు సైతం రాకపోకలు సులువుగా మారాయి. మండల కేంద్రంలో ప్రతి గల్లీ సీసీ రోడ్లతో దర్శనమిస్తున్నాయి.
రూ.కోటితో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం
నస్రుల్లాబాద్‌లో సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృషితో ఎస్డీఎఫ్ నుంచి రూ. కోటితో కార్యాలయాల సముదాయానికి నిధులు కేటాయించారు. భవన నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఏడాది కాలంలోనే ఎంతో పురోగతి సాధించడంతో ప్రజలు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు నెలల్లోనే సంబంధించిన శాఖ అధికారులకు భవనం అప్పగించనున్నా రు.
స్పీకర్ కృషిని ప్రజలు మరిచిపోలేరు
నస్రుల్లాబాద్ను మండలంగా ప్రకటించడంలో స్పీకర్ ప్రత్యేక కృషి ఉంది. మండల ప్రజలు స్పీకర్‌ను ఎప్పటికీ మరిచిపోలే రు. మండల కేంద్రానికి గ్రామం దూరంగా ఉండడంతో అభివృద్ధి కి నోచుకోలేదు. ప్రస్తుతం గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది.
– కంది మల్లేశ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు
అద్దె భవనాల బెడద తప్పనుంది..
నూతనంగా మండలం ఏర్పాటు అయిన నాటి నుంచి కార్యాలయాలు అన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కార్యాలయాల సముదాయం పనులు చురుగ్గా కొనసాగడంతో అద్దె భవనాల బెడద తప్పనుంది.
– ఇమ్రాన్, నస్రుల్లాబాద్