విద్యానగర్/ఇందూరు, ఆగస్టు 20: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. భారతదేశ గొప్పతనం, త్రివర్ణ పతాకం ప్రాముఖ్యత, బాలికల విద్య ఆవశ్యకత తదితర అంశాలపై అందమైన ముగ్గులు వేశారు. ఆకర్షణీయమైన ముగ్గులు రంగుల హరివిల్లును తలపింపజేశాయి. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కళాభారతి ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్ పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితమే స్వేచ్ఛ, సమానత్వమని అన్నారు. దేశం గర్వించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తోందని చెప్పారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ.. నేటి యువత సమరయోధుల అడుగుజాడల్లో నడవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వవిప్ ముగ్గుల పోటీల విజేతలకు రూ.500 చొప్పున నగదు బహుముతులను అందజేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందు ప్రియ, అదనపు కలెక్టర్ వెంకటేశ్దోత్రే, మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన రంగోలీ పోటీల్లో యువతులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని దేశభక్తి, జాతీయతా భావం ఉట్టిపడే రీతిలో ఆకర్షణీయంగా ముగ్గులు వేశారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్, కలెక్టర్ మాట్లాడారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన భవాని, స్వప్న, లావణ్యకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రణవి, వినీషా, సుస్మితకు కన్సోలేషన్ ప్రైజులు దక్కాయి. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి ఝాన్సీ, జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారిణి శశికళ పాల్గొన్నారు.