కామారెడ్డి, సెప్టెంబర్ 13 : శ్రమదానంతో పరిసరాలు పచ్చదనంతో కళకళలాడాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో వివిధ శాఖ అధికారులు, సిబ్బంది శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వస్తువులను తొలగించారు.
అనంతరం కలెక్టర్ భవన సముదాయంలో కలియతిరుగుతూ గార్డెన్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కార్యాలయాల్లోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. శ్రమదానంలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ పరిపాలనా అధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీ-ప్రైడ్ పథకం కింద పెట్టుబడి రాయితీ మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఐ-పాస్ కింద నలుగురు ఎస్సీలకు రూ.13 లక్షల 89 వేల 491, ఎనిమిది మంది ఎస్టీలకు రూ. 23 లక్షల 80 వేల 529 పెట్టుబడి రాయితీ మంజూరుకు కమిటీ ఆమోదించినట్లు పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ లాలూ నాయక్, ఎల్డీఎం రవికాంత్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి రజిత, డీపీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.