కామారెడ్డి, జనవరి : 16: జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ చైతన్యారెడ్డి తెలిపారు. గురువారం ఆమె కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 10న పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో ఉన్న ఐదు ఆలయాల్లో జరిగిన చోరీపై ఆలయ చైర్మన్ కృష్ణయాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు. గురువారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ముగ్గురు అనుమానితులను పోలీసులు పట్టుకొని విచారించారని చెప్పారు.
విచారణలో కామారెడ్డి పోలీసు స్టేషన్ పరిధిలో ఐదు, దేవునిపల్లి పరిధిలో మూడు, భిక్కనూర్, రామారెడ్డి, ఎడపల్లి పోలీసుస్టేషన్ల పరిధిల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 11 దొంగతనాలు చేసినట్లు తేలిందని తెలిపారు. ఈ కేసులో నిందితులైన కామారెడ్డికి చెందిన నిమ్మలవోయిన సురేశ్, డిచ్పల్లి మండలం నడిపల్లికి చెందిన రుద్రబోయిన గణేశ్, ఎడపల్లి మండలం తాడెం గ్రామానికి చెందిన గాజుల శ్రీధర్‌ను అరెస్టు చేసి, వారి నుంచి రూ.4 లక్షల విలువ చేసే మూడు గ్రాముల బంగారం, మూడు బైకులు, రెండు మైక్ సెట్లు, ఒక ఆటో, ఒక మేక, ఏడు జతల వెండి కండ్లు, ట్రాక్టర్ బ్యాటరీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీరామ్, సిబ్బంది పాల్గొన్నారు.