పెద్ద కొడప్గల్, డిసెంబర్ 12: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు నిరసన సెగ తగిలింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ మండలంలోని బేగంపూర్ తండావాసులు ఎమ్మెల్యేను అడ్డుకొని నిలదీశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో వెనుదిరిగారు. కాంగ్రెస్ నాయకులు గురువారం రాత్రి తండాకు వెళ్లి, ఎమ్మెల్యే శుక్రవారం ఎన్నికల ప్రచారానికి రానున్నారని, అందరూ అందుబాటులో ఉండాలని, హామీల గురించి మాట్లాడుదామని చెప్పారు. శుక్రవారం ఎమ్మెల్యే పెద్ద కొడప్గల్, బేగంపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని బేగంపూర్ తండాలో ఆగకుండా కాస్లాబాద్, వడ్లం గ్రామాలకు ప్రచారానికి వెళ్లారు.
అక్కడ ప్రచారం ముగించుకొని తిరిగి బేగంపూర్ తండాకు చేరుకోగా ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. తండాలో అగకుండా వెళ్లిన వారు మళ్లీ ఎందుకు వచ్చారని తండావాసులు ప్రశ్నించగా, ఎందుకు ఆగాలని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. దీంతో ప్రజల ఓట్లు కావాలి గానీ, తండా ప్రజల సమస్యలు అవసరం లేదా అని ప్రశ్నించారు. తండాకు మంజూరైన సీసీ రోడ్డును రద్దు చేసి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు తమ ఇంటి ముందు వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తండాలో వర్షాకాలం మోకాలు లోతులో నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పట్టించుకోరా అని ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ క్రమంలో తండావాసులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఎమ్మెల్యే తండాకు చెందిన యువకులపైకి దూసుకెళ్లారు. ఎమ్మెల్యే హోదాలో ప్రజలపైకి కొట్టడానికి వస్తారా, ప్రజా పాలన అంటే ఇదేనా అంటూ తండావాసులు ప్రశ్నించారు. తండావాసులపై కాంగ్రెస్ నాయకులు గొడవలు సృష్టిస్తూ, దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. తండా ప్రజలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి తిరిగివెళ్లిపోయారు.