నిజాంసాగర్, అక్టోబర్ 29: అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన ఆ నియోజకవర్గమే జుక్కల్. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైందీ ప్రాంతం. గ్రామాలకు రహదారులు లేవు. గొంతు తడుపుకొనేందుకు నీరుండేది కాదు. ఇక సాగునీటి సంగతి అయితే పట్టించుకున్న వారే లేరు. విద్య, వైద్య వసతులు అసలే లేని దైన్య పరిస్థితి. అలాంటిది స్వరాష్ట్రంలో జుక్కల్‌లో ప్రగతి పరుగులు పెట్టింది. కేసీఆర్ అధికారం చేపట్టాక అభివృద్ధి బాట పట్టింది. దశాబ్దాల పాటు పడిన కష్టాలు, కన్నీళ్లను దూరం చేసుకొని బీఆర్ఎస్ పాలనలో ప్రగతి పథాన పయనిస్తున్నది. వేల కోట్లాతో వంతెనలు, రహదారుల నిర్మాణం, ప్రతీ గ్రామానికి బీటీరోడ్డు, వాడవాడలా సీసీ రోడ్లు, ఇంటింటికీ మిషన్ భగీరథ జలాలు, డ్రైనేజీలు ఇలా అన్ని వసతులు సమకూరాయి. విద్య, వైద్యరంగంలో విశేష ప్రగతి సాధ్యమైంది. చదువుకోవడానికైనా, వైద్య సేవల కోసమైనా ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి పోయింది.
సీఎం కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే హన్మంత్‌షిండే చొరవతో బీడు భూములు సాగులోకి వచ్చాయి. నిజాంసాగర్ మండలంలోని కొమలంచ-వొడ్డెపల్లి గ్రామ శివారులో మంజీరా పరీవాహక ప్రాంతంపై రూ.476 కోట్లతో నాగమడుగు మత్తడి నిర్మాణ పనులను ప్రారంభించించారు. దీంతో నాన్‌కమాండ్ ఏరియాలోని 40వేల ఎకరాల భూములు సాగులోకి రానున్నాయి. నియోజకవర్గంలో వాగులపై 13 చెక్‌డ్యాంలు మంజూరయ్యాయి.
తొమ్మిదేండ్ల క్రితం నియోజకవర్గంలో 120 గ్రామాలకు రోడ్డే లేకపోయేది. అలాంటిది కేసీఆర్ పాలనలో దాదాపు అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మించారు. సంగారెడ్డి-అకోలా-నాందేడ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చడంతో నియోజకవర్గం అభివృద్ధి పథంలోకి దూసుకుపోతున్నది. నిజాంసాగర్‌లో మంజీరా నదిపై రూ.25 కోట్లతో వంతెన నిర్మించడంతో దశాబ్దాల ఇక్కట్లు దూరమయ్యాయి. పిట్లం మండలంలో కుర్తి వంతెన, పెద్దకొడప్గల్ మండలంలో రూ.8 కోట్లతో తక్కడపల్లి వంతెన, బిచ్కుంద మండలంలో దేవాడ వంతెన పెద్దతక్కడపల్లి వంతెన, బిచ్కుంద-బాన్సువాడ రహదారి, పిట్లం-బాన్సువాడ రహదారి, నిజాంసాగర్-పిట్లం చౌరస్తా రహదారి నిర్మాణాలతో రవాణా వ్యవస్థ ఎంతగానో మెరుగుపడింది. రూ.6 కోట్లతోనిజాంసాగర్-గున్కుల్ వంతెన, సింగీతం వాగుపై రూ.4 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. మిగిలిపోయిన రహదారులు, వంతెనల నిర్మాణాలకు ఇటీవలే రూ100 కోట్లు మంజూరు కావడంతో పనులు ప్రారంభమయ్యాయి.
పిట్లం మండలంలో 30 పడకల దవాఖాన మంజూరైంది. పనులు సైతం ప్రారంభమయ్యాయి. బిచ్కుంద మండల కేంద్రంలో రూ.8 కోట్లతో నూతన దవాఖాన నిర్మాణం పూర్తిచేసి, డయాలసిస్ సేవలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడది వంద పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వసతులు సమకూర్చేందుకు రూ.26 కోట్ల నిధులు సైతం మంజూరు చేశారు.
గతంలో టెన్త్, ఇంటర్ చదువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ప్రతీ మండలానికి కస్తూర్బా, గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. బిచ్కుందలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న డిగ్రీ కళాశాల బీఆర్ఎస్ హయాంలోనే మంజూరు కావడం విశేషం.
నిజాంసాగర్ ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు నిర్మించడంతో ప్రాజెక్టు ఎడారిగా మారింది. సీఎం కేసీఆర్ కాళేశ్వరం నీటిని తీసుకొచ్చి నిజాంసాగర్‌కు పూర్వవైభవం తెచ్చారు. కాళేశ్వరం గంగ నడిచొచ్చిన తరుణంలో నిజాంసాగర్ ఆయకట్టు కింద రెండు పంటల సాగుకు ఢోకా లేకుండా పోయింది.