సుభాష్‌నగర్, జూలై 8 : అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) – ద్వారకానగర్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో జగన్నాథ రథయాత్ర సోమవారం కన్నుల పండువగా కొనసాగింది. ఈనెల 5న కొత్త గంజ్ క్లాక్‌టవర్ సమీపంలో విశాలమైన మండపం పైన జగన్నాథుడు, సుభద్ర, బలరాముల విగ్రహాలను నెలకొల్పి ఐదు రోజులుగా ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కొత్త గంజ్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర గాంధీచౌక్, పెద్దబజార్, ఆర్ఆర్చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్, భారీ హనుమాన్ చౌక్‌కు చేరుకున్నది. ప్రత్యేక పూజల అనంతరం పూలాంగ్ చౌరస్తా, హైదరాబాద్ రోడ్, పాత కలెక్టరేట్ మీదుగా కొత్తగంజ్, క్లాక్‌టవర్ ప్రాంగణానికి చేరుకున్నది. హరేరామ హరేకృష్ణ నామస్మరణ ప్రధానవీధుల గుండా మార్మోగింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శోభాయాత్రలో పాల్గొన్నారు. పల్లకీసేవ అనంతరం ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఇస్కాన్ అధ్యక్షుడు సిద్ధ బలరామ్, వెంకటదాసులతో పాటు ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. శోభాయాత్ర సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించడంతోపాటు సందర్భంగా పలుచోట్ల ట్రాఫిక్ మళ్లించారు.