నిజామాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) అసోసియేషన్‌లో మొదలైన ప్రక్షాళన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీవో) అసోసియేషన్‌లో సెగలు రేపింది. టీఎన్జీవోలో అనర్హుల ఏరివేత ఇప్పటికే విజయవంతంగా జరిగింది. గెజిటెడ్ ఉద్యోగులకు టీఎన్జీవోలో చోటు దక్కడంపై అవాక్కయిన ప్రభుత్వం వెంటనే తప్పుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగి నిజామాబాద్ సంఘంలో మార్పులు చేర్పులు చేసింది. టీఎన్జీవోలో పదవిని వీడిన నేతలు.. ఇప్పుడేం చేయాలో తెలియక వేరే సంఘంలో చోటు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఫలితంగా నిజామాబాద్ గెజిటెడ్ సంఘంలో ఎన్నికల వేడి రగిలింది. తెలంగాణ గెజిటెడ్ సంఘ అధ్యక్ష పదవి కోసం నగారా మోగింది. అక్టోబర్ 5న నామినేషన్ దాఖలు మొదలు అదే రోజు ఎన్నికలు, ఫలితాలను ప్రకటించనున్నారు. టీజీవో ఎన్నికల అధికారిగా కామారెడ్డి రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డిని ఎన్నికల అథారిటీ నియమించింది. నోటిఫికేషన్ జారీ కావడంతో పలువురు ఆశావాహుల్లో ఉత్సాహం కనిపిస్తుండగా, టీఎన్జీవో నుంచి వచ్చిన నేతలు సైతం బరిలోకి దిగేందుకు సిద్ధం కావడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా ఏకగ్రీవంగానే అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందా? అన్న దానిపై చర్చ జరుగుతున్నది.
వాస్తవానికి కొందరు దశాబ్దాలుగా టీఎన్జీవోలో పాతుకుపోవడంతో వారిని తొలగించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, విచిత్రంగా టీఎన్జీవోలో కాకుండా టీజీవోలో రాకెట్ వేగంతో ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుండడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొన్నది. ఏండ్లుగా టీఎన్జీవోలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తప్పుకోవడంతో అనివార్యంగా ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు రాష్ట్ర నాయకులు 20 రోజుల క్రితం నిజామాబాద్‌కు వచ్చి ఈ విషయంపై స్పష్టతను ఇచ్చారు. కానీ ఎన్నికలను మాత్రం నిర్వహించడం లేదు. మొదట తాలూకా స్థాయిలో ఎన్నికలు జరపాల్సి ఉంది. ఆ తర్వాత జిల్లా కార్యవర్గం కూర్పు జరగాలి.
టీఎన్జీవో ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ ముందడుగు పడక పోవడంపై ఉద్యోగుల్లో అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు, మొన్నటిదాకా చడీచప్పుడు లేని టీజీవోలో ఎన్నికల కోలాహలం నెలకొనడం, ఒకేరోజు నామినేషన్ల స్వీకరణ, అదే రోజు పోలింగ్, ఫలితాల వెల్లడి కానుండడం అనేక రకాల చర్చలకు దారి తీసింది. టీజీవో ఎన్నికలకు సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ జారీ చేశారు. సాంకేతికంగా వారం, పది రోజుల గడువు ఉన్నట్లుగా చూపించినప్పటికీ ఒకే రోజు (అక్టోబర్ 5న) తతంగాన్ని ముగిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకున్నది. పైగా ఓటరు జాబితాను ముందస్తుగానే ప్రకటించాలి. ఈ విషయంలోనూ స్పష్టత కరువైంది. ఓటరు జాబితాను కూడా పోలింగ్ రోజే ప్రకటిస్తారా.. ముందు రోజే విడుదల చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగించారు. నాకిచ్చిన బాధ్యతను న్యాయబద్ధంగా, పారదర్శకంగా పూర్తి చేస్తాను. అక్టోబర్ 5న పోలింగ్, ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులందరితో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను శాంతియుతంగా పూర్తి చేస్తాం.
– కె.శ్రీనివాస్ రెడ్డి, టీజీవో ఎన్నికల అధికారి( కామారెడ్డి రవాణా శాఖ అధికారి)