ఉమ్మడి జిల్లాలోనూ బెట్టింగ్ యాప్‌లను ఆశ్రయించి బలవుతున్నారు. చిన్నపాటి ఆశతో బెట్టింగ్‌లో వేలు పెట్టి శరీరాన్ని దహించుకుంటున్నారు. నెల రోజుల క్రితం ఎడపల్లి మండలంలో ఓ యువకుడు బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి తీవ్రంగా నష్ట పోయాడు. రూ.80లక్షలు అప్పుల పాలై వాటిని తీర్చలేక తనువు చాలించుకున్నాడు. గతేడాది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలోనూ కామారెడ్డి జిల్లాలో ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నా డు. అనేక మంది కంటికి కనిపించకుండా బె ట్టింగ్ వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు.
ఇంట్లో వారికి తెలియకుండా అప్పులు చేసి వాటిని తీర్చలేక సతమతమవుతున్నారు. చేసిన అప్పులను తీర్చడం కోసం దొడ్డి దారిలో లోన్ యాప్‌లను ఆశ్రయించి మరింతగా నష్టాల ఊబిలోకి చిక్కుకుపోతున్నారు. కొంత మంది చైన్ స్నాచింగ్, దొంగ తనాలకు పాల్పడుతుండగా, మరికొంతమంది గంజాయ్ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ దందా మరోసారి బుసలు కొడుతున్నది. పోలీసులకు చిక్కకుండా కొందరు, ఖాకీలను మచ్చిక చేసుకుని మరికొందరు ఈ వక్రమార్గాన్ని ఎంచుకుని బెట్టింగ్‌లో దర్జాగా సంపాదిస్తున్నారు. సామాన్య యువతను రోడ్డున పడేస్తున్నారు.
బెట్టింగ్‌లో చిక్కితే భవిష్యత్తు అంధకారమే..
ఈజీ మనీకి అలవాటు పడి చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు. యువత సన్మార్గంలో నడవాలి. బెట్టింగ్‌లో పట్టుబడితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. మా రికార్డుల్లో పేరు, చిరునామా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. బెట్టింగ్ ఆడుతూ లేదా నిర్వహిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవు. చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా ఉద్యోగాలు సాధించాలి. ఇలాంటి వ్యవహారాల్లో తల దూర్చవద్దని కోరుతున్న.
– పి.సాయి చైతన్య, నిజామాబాద్ పోలీస్ కమిషనర్(హోలీ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సీపీ వ్యాఖ్యలు)
ఓ వైపు యాప్‌లు, మరోవైపు ఐపీఎల్
కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ‘బెట్టింగ్’పై చర్చ నడుస్తున్నది. నిత్యం ఏదో ఒకచోట బెట్టింగ్‌లో తీవ్ర నష్టాలపాలవుతుండడం దీంతో ఆత్మహత్యలకు పాల్పడడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు బెట్టింగ్ యాప్‌లు, మరోవైపు ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం వెరసి యువత జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఈ ఊబిలో అడుగు బెడితే చాలు జీవితాలు సర్వనాశనమవుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బుల సంపాదించాలనే దురాశతో యువత అక్రమ మార్గం ఎంచుకుంటున్నది.
తీరా జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో చేసేదేమీలేక, ఇంట్లోవారికి చెప్పుకోలేక తనువు చాలించుకుంటున్నారు. కండ్ల ముందే అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కనిపిస్తున్నా, మార్పు కనిపించడం లేదు.
-నిజామాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
గతంలో పోలీసులతోనే కుమ్మక్కు..
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ గ్రామీణ ప్రాంతాలకు వేగంగా అంటుకుంటున్నది. యువత పెద్ద మొత్తంలో అప్పు లు చేస్తూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నది. తల్లిదండ్రులు, పిల్లల వ్యవహారశైలిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. డబ్బుల కోసం వారు చోరీలకు పాల్పడే అవకాశం ఉన్నదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు బోలెడంతా వినోదం ఇస్తుండడంతో ఆట ఆరంభం నుంచి చివరి వరకు ఉత్కంఠను రేపుతున్న మ్యాచ్‌లను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే సమయంలో బెట్టింగ్ బాబులు జోరుగా పందేలకు తెరలేపుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఐదేండ్ల క్రితం డీఎస్పీ, సీఐ, ఎస్సైలు నేరుగా బెట్టింగ్ బాబులతో చేతులు కలిపి అడ్డంగా ఏసీబీకి చిక్కారు. వక్రమార్గంలో డబ్బులు సంపాదించేందుకు అక్రమార్కులతో పోలీసులే చేతులు కలిపారు. ఇలాంటి ఖాకీలు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోనూ ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. కొంత మంది పోలీసులైతే బెట్టింగ్‌లు కాస్తూ చెలరేగిపోతున్నట్లుగా ప్రచారం ఉంది. నిఘా వర్గాల నిర్లక్ష్యానికి తోడు పకడ్బందీగా పర్యవేక్షణ లేమి వల్లే ఈ వక్రమార్గం అంతులేని విధంగా వ్యాప్తి చెందుతున్నది. గతంలో నిజామాబాద్ నగరంలో వన్ టౌన్, టూ టౌన్ ఏరియాలో బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు చేసిన ఉదంతాలు అనేక ఉన్నాయి. ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకుని నిర్వాహకులు అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన వేళ అలాంటి దందాపై మరింత నిఘా పోలీసులు పెంచాల్సిన అవసరం ఉంది.
సీక్రెట్ కోడ్ వయా టెలిగ్రామ్ యాప్
ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో బెట్టింగ్ అక్రమార్కులు రంగంలోకి దిగారు. తమ పాత పద్ధతిలోనే సీక్రెట్ కోడ్లు వాడుతూ బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. రహస్య సంకేతాలను వినియోగించడంతోపాటు వాట్సాప్‌కాల్‌లో ఈ తంతును పూర్తి చేస్తున్నారు. కొందరు వాట్సాప్ గ్రూపులు సైతం నిర్వహిస్తుండగా, మరికొంత మంది టెలిగ్రామ్ యాప్‌లను వాడుతున్నట్లుగా తెలుస్తోంది. బుకీల వద్ద పందేలు కాసే వారంతా కోడ్ భాషను వినియోగిస్తున్నారు.
వారి దగ్గర ఒకసారి రిజిష్టర్ అయిన నంబర్ నుంచి ఫోన్ వస్తేనే మాట్లాడతారు. లెగ్ అనే పదం బెట్టింగ్ రాయుళ్లు వాడే కోడ్ భాషలో ప్రధానమైంది. ఎవరు ఎన్ని లెగ్‌లు తీసుకుంటే అన్నింటికీ లెక్కగట్టి మొత్తం చెల్లించాలి. గెలిచే అవకాశాలు ఎక్కవగా ఉన్న జట్టుపై బెట్టింగ్ పెడితే ఫ్లయింగ్, తక్కువగా ఉన్న జట్టుపై బెట్టింగ్ పెడితే ఈటింగ్ అనే పదాలను వాడుతున్నట్లు సమాచారం. మ్యాచ్ జరిగే రోజునే అప్పటికప్పుడు లావాదేవీలను నిర్వాహకులు పూర్తి చేస్తున్నట్లు తెలిసింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు 20 ఓవర్లు కావడంతో పలు రకాల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
టాస్ నుంచి మొదలుకొని ..
టాస్ నుంచి మొదలుకొని స్కోర్, జట్టు గెలుపు, ఓటములపై స్కోర్ చివరి నంబర్ ఇలా పలు రకాల్లో రూ.వంద నుంచి రూ.10వేల వరకు పందెం వేస్తున్నారు. గతంలో పందెం కోసం ప్రత్యేకంగా గదులు, లాడ్జిలను అద్దెకు తీసుకుని, అందులో టీవీతో పాటు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసుకునేవారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లోనే నిర్వహిస్తున్నట్లు సమాచారం. శివారు ప్రాంతాల్లో ఉన్న గదుల్లో మకాం వేసి తంతును కొనసాగిస్తున్నారు. హోటళ్లలోనూ ఎవరికీ అనుమానం రాకుండా రూమ్‌లను అద్దెకు తీసుకుని రెండు, మూడురోజులకోసారి హోటళ్లను మార్చుకుంటూ బెట్టింగ్‌లను నిర్వహిస్తున్న ముఠాలు కూడా నిజామాబాద్‌లో ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.