వినాయక్‌నగర్, జూన్ 6: వివిధ ప్రాంతాల్లో 24 కేసుల్లో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయినప్పటికీ పొలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులు పట్టుకొన్నారు. కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడి పోలీసుల కండ్లు కప్పి తిరుగుతున్న సదరు నేరస్తుడి కోసం అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ ప్రాంతంలో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) బృందం ఎట్టకేలకు పట్టుకున్నది.
ఈ మేరకు సీపీ సాయి చైతన్య వెల్లడించిన వివరాల మేరకు .. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్ తాలూకా ఖానాపూర్ గ్రామానికి చెందిన బబ్లూ బాలాజీ గైక్వాడ్ అలియాస్ ధన్ల బాబు అనే పాత నేరస్తుడు కొంత కాలంగా కామారెడ్డి జిల్లాలో నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. సదరు నేరస్తుడిపై వివిధ ప్రాంతాల్లో 24 నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
రెండురోజులుగా నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో మళ్లీ నేరా లు చేయడానికి తిరుగుతున్నట్లు సీపీకి సమాచారం అందింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారితోపాటు సిబ్బంది అప్రమత్తమై తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని పట్టుకున్నారు. నేరస్తుడిని కామారెడ్డి జిల్లా పోలీసులకు అప్పగించిన సీసీఎస్ టీమ్‌ను సీపీ సాయి చైతన్య ఈ సందర్భంగా అభినందించారు.