ఆర్మూర్‌టౌన్, జూలై 19: గురుకుల కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్మూర్‌లోని గిరిజన గురుకుల పాఠశాలలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాంతానికి చెందిన సంతోష్.. వేల్పూర్ గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండియర్ (బైపీసీ) చదువుతున్నాడు. వేల్పూర్ గురుకులానికి సొంత భవనం లేకపోవడంతో తాత్కాలికంగా ఆర్మూర్ శివారులోని భవనంలో నిర్వహిస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన సంతోష్ తండ్రి ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లగా, తల్లి కూడా పనిచేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నారు.
ఇటీవలే నిజాంసాగర్లోని ఇంటికి వెళ్లిన సంతోష్ మూడ్రోజుల క్రిత మే తిరిగి వచ్చాడు. తోటి విద్యార్థులతో సరదాగా గడిపిన అతడు శనివారం ఉదయం కూడా హుషారుగానే ఉన్నాడు. ఏమైందో ఏమో గానీ 7 గంటల సమయంలో హాస్టల్ నుంచి బయటికి వెళ్లిన అతడు సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
అతడి మృతికి గల కారణాలు తెలియరాలేదని, ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు, సంతోష్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు స్థానిక ప్రభుత్వ దవాఖానలోని పోస్టుమార్టం గది ఎదుట ఆందోళనకు దిగారు. కాలేజీ ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు విద్యార్థి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.