కామారెడ్డి, మే 28 : ఓ వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసేందుకు పథక రచన చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ యత్నాన్ని భగ్నం చేసి, ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తాడ్వాయి మండలం క్రిష్ణాజివాడి శివాలయం సమీపంలో ఈ నెల 27న కొందరు పోలీసులను చూసి పారిపొతుండగా ఎస్సై సిబ్బందితో కలిసి వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా కిడ్నాప్ కుట్ర బహిర్గతమైంది. కామారెడ్డికి చెందిన భూస శ్రీనివాస్ అనే వ్యాపార వేత్తకు చిట్యాల గ్రామానికి చెందిన నిట్టు నర్సింగరావు, సురం స్వామి, సంతాయిపేట గ్రామానికి చెందిన సూర స్వామి, పులి ప్రశాంత్ గౌడ్‌తో గతంలో ఆర్థిక లావాదేవీలు ఉండేవి.
భూస శ్రీనివాస్ వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉన్నదని భావించిన వారు పాత బాకీలు కూడా ఎగ్గొట్టవచ్చనే దురుద్దేశంతో ఆయనను కిడ్నాప్ చేయడానికి పథకం రచించారు. ఇందుకోసం తుపాకీ అవసరమని భావించి, మహారాష్ట్రలోని అజయ్ హన్మంతరావు గోంగపాలే, వైభవ్ ప్రకాశ్ బరాడేవర్ అనే వ్యక్తులను కలిశారు. వారి ద్వారా నయ్గావ్కు చెందిన మారుతి గోకేను ఈ నెల 12న కలిసి రూ.30 వేలకు తుపాకీని మాట్లాడుకొని అడ్వాన్స్‌గా రూ. 27వేలు చెల్లించారు. మారుతి గోకే అందజేసిన తుపాకీని తీసుకొని వైభవ్ ప్రకాశ్ బరాడేవర్, అజయ్ హన్మంత రావు గోంగపాలే ఈ నెల 27న కృష్ణాజీవాడ గ్రామ సమీపానికి చేరుకున్నారు. కిడ్నాప్ చేయడానికి పథక రచన చేసిన వారికి అప్పగించే ప్రయత్నం చేస్తున్న సమయంలో తాడ్వా యి పోలీసులు చాకచక్యంగా వ్యహరించి వారిని వెంబడించి పట్టుకున్నారు.
వారి కిడ్నాప్ కుట్రను భగ్నం చేసినట్లు ఎస్పీ వివరించారు. నిందితులైన నిట్టు నర్సింగరావు, సురం స్వామి, సూర స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన వైభవ్ ప్రకాశ్ బరాడేవర్, అజయ్ హన్మంత రావ్ గోంగపాలేను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో నిందితుడైన మారుతి గోకే పరారీలో ఉన్నాడని చెప్పారు. నిందితుల నుంచి ఒక నల్ల రంగు ఫైర్ ఆర్మ్, రబ్బర్ బుల్లెట్లు, ఎయిర్ రైఫిల్, పెల్లెట్ బాక్సు లు 2, ఐదు మొబైల్ ఫోన్లు, రెండు మంకీ క్యాప్స్, మూడు మాస్కులు, నైలాన్ తాడు, పసుపు రంగు టేపు, నల్ల రంగు గాగుల్స్, రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో ఎల్లారెడ్డి డీ ఎస్పీ శ్రీనివాస్ రావు, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్సై నరేశ్, సదాశివనగర్ ఎస్సై, ఐటీకోర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పీసీ యాదగిరి, సీసీఎస్ పీసీలు మైసయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.