నిజామాబాద్, ఖలీల్వాడి : ఇంటర్ పరీక్షలు నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా ( Inter exams) కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ( Collector Rajivgandhi Hanmanth ) పరీక్షల తొలిరోజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు.
సీసీ కెమెరా( CC Cameras ) నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా? నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా ? లేదా ? అని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఎఎన్ఎం, టాయిలెట్స్ అందుబాటుపై ఆరా తీశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని పరీక్షల సిబ్బంధికి సూచించారు.
పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి కాపీయింగ్ కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ వాచీలు వంటి ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కలెక్టర్ వెంట పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సూరయ్య, తదితరులు ఉన్నారు.