కంఠేశ్వర్, మే 27 : యాసంగి వరి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు సన్నద్ధత, ఇందిరమ్మ ఇండ్లు భూభారతి తదితర అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో కలిసి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే 8.19 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించామని, రాష్ట్రంలో ముందంజలో నిలిచామని చెప్పగా, సీఎం, మంత్రులు అభినందించారు.
ఇదే స్ఫూర్తితో మిగిలిన ధాన్యాన్ని సైతం పూర్తిస్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిల్లర్లు, దళారులు రైతులను నష్టపర్చేలా వ్యవహరిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వానాకాలంసీజన్కు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు.
అధికారులతో కలెక్టర్ సమీక్ష..
జిల్లాలో ధాన్యం సేకరణపై సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సమీక్షించారు. రికార్డు స్థాయిలో 8.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. 700 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టామని, కొనుగోళ్లు పూర్తయినందున 625 కేంద్రాలను మూసివేశామన్నారు. 75 కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశలో ఉందని తెలిపారు. 1,00,535 మంది రైతుల ఖాతాల్లో రూ. 1786.13 కోట్ల మేర ధాన్యం డబ్బులు చెల్లించామన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.