ఇందల్వాయి, ఏప్రిల్ 8 : ఆపద సమయంలో లేదా ఇంకేమైనా ప్రమాదం జరిగితే వెంటనే సాయం కోసం డయల్ 100 నంబర్‌కు కాల్చేస్తే పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తారు లేదా బాధితులకు అండగా ఉంటారు. కానీ ఇందల్వాయి పోలీసులు మాత్రం ఫిర్యాదుదారుడిపై తమ ప్రతాపం చూపెట్టారు. స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారు.
ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. బాధితుడి కథనం ప్రకారం.. ఇందల్వాయికి చెందిన శ్రీనివాస్ అలియాస్ సాయి మండల కేంద్రంలో పెయింట్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి తన దుకాణం ఎదుట మద్యం తాగిన ఓ వ్యక్తి బైక్ అడ్డుగా పెట్టడంతో గొడవ చోటుచేసుకున్నది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి సాయిలును దూషించాడు. దీంతో సాయిలు డయల్ 100 నంబర్‌కు కాల్ చేశాడు. ఎంతసేపైనా పోలీసులు రాకపోవడంతో తిరిగి మరోసారి కాల్ చేశాడు.
కొద్దిసేపటికి అక్కడి చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో గొడవ చేసిన వ్యక్తిని వదిలి, ఫిర్యాదు చేసిన సాయిలుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మద్యం తాగిన వ్యక్తికి బ్రీత్ ఎనలైజర్ పెట్టాలని కోరగా.. తమకే ఎదురు చెబుతావా, 100 డయల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశావని, నీకు పనీపాట లేదా అంటూ దురుసుగా వ్యవహరించారు.
అనంతరం పోలీస్‌స్టేషన్ రావాలని చెప్పగా.. సాయిలు తన సోదరుడితో కలిసి వెళ్లాడు. స్టేషన్లో తనపై విచక్షణారహితంగా ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు దాడి చేశారని సాయిలు వాపోయాడు. తనతో వచ్చిన తమ్ముడు మోహన్‌పై సైతం దాడి చేశారని తెలిపాడు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన సాయిలు ప్రభు త్వ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఎస్సైతోపాటు కానిస్టేబుళ్లపై సీపీతోపాటు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపాడు.
దురుసుగా ప్రవర్తించడంవల్లే కేసు నమోదు
అన్సాన్పల్లి గ్రామానికి చెందిన మోహన్, తిర్మన్‌పల్లికి చెందిన శంకర్ ఇద్దరు గొడవ పడుతున్నారని ఫిర్యాదు రావడంతో మా కానిస్టేబుళ్లు అక్కడకి వెళ్లారు. విచారణ సమయంలో కానిస్టేబుళ్లపై సాయిలు అతని సోదరుడు దాడికి ప్రయత్నించి, దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు ఎవరిపై దాడి చేయలేదు. విధులకు ఆటంకం కలిగించడంతోనే వారిపై కేసు నమోదు చేశాం.
-ఎస్సై మనోజ్ కుమార్