ఇందల్వాయి, జూన్ 2: టోల్ప్ల్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్‌ఫీజు ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ప్రతి ఏడాది ఏప్రిల్ 1న టోల్ ధరలు 5శాతం పెంచుతుంటారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపు ఈసారి తాత్కాలికంగా నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తవ్వడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచే పెంచిన టోల్ ధరలు అమలులోకి వచ్చాయి. హైదరాబాద్ మార్గంలో తూప్రాన్, కామారెడ్డి జిల్లా భిక్కనూర్, నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, నిర్మల్ వద్ద ఉన్న టోల్ ప్లాజాల్లో చార్జీల పెంపును 3వ తేదీ ఉదయం నుంచి అమలు చేస్తున్నామని ఇందల్వాయి టోల్‌ప్లాజా మేనేజర్ వీరబాబు తెలిపారు. టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు చెందిన స్థానిక వాహనాల నెలవారీ పాసు ధరను రూ.330 నుంచి రూ.340కి పెంచారు. ఇక పెరిగిన టోల్ ఫీజుల భారాన్ని ఆర్టీసీ ప్రయాణికులపైనే వేస్తున్నది. ఆర్టీసీకి చెందిన వివిధ సర్వీసుల్లో ప్రయాణించే ఒక్కో ప్రయాణికుడిపై రూ.3 అదనపు భారం పడనున్నది.