నవీపేట, జూన్9: తెలంగాణ రాష్ట్రంలో మత రాజకీయాలు చేస్తూ అడ్డదారిన అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్న బీజేపీ నాయకులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్ అన్నారు. శుక్రవారం మండలంలోని నందిగామ, కోస్లీ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రసంగించారు. బీజేపీ అధికారంలో ఉన్న పలు రాష్ర్టాల్లో తెలంగాణ తరహాలో అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ లాంటి పథకాలకు ఆకర్శితులైన మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని అన్నారు. బీసీ సంక్షేమ పథకం కింద చేతి వృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం మంజూరు చేస్తామని అన్నారు. సర్పంచ్ కోస్లీ లావణ్యా కిషన్‌రావు విన్నపం మేరకు గ్రామాభివృద్ధికి తనవంతు చేయూతనందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు.
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
నవీపేట మండలంలోని నందిగామ, కోస్లీ గ్రామాల్లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు. నందిగామలో ప్రభుత్వం ద్వారా కురుమ యాదవులకు రెండో విడుత గొర్రెలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కోస్లీ గ్రామంలో మున్నూరు కాపు, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, పల్లె దవాఖాన హెల్త్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 206 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్, జడ్పీటీసీ నీరడి సవిత బుచ్చన్న, తహసీల్దార్ వీర్‌సింగ్, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ, సీఐ నరహరి, ఎస్సై రాజరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్‌రావు, వైస్ ఎంపీపీ ఇందూర్ హరీశ్, నందిగామ, కోస్లీ సర్పంచులు లావణ్యా కిషన్‌రావు, నీలేశ్‌కుమార్, లలితా సంజీవ్, బీఆర్ఎస్ నాయకులు తెడ్డు పోశెట్టి, నీరడి బుచ్చన్న, దొంత ప్రవీణ్‌కుమార్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మానికేశ్వర్‌రావు, కిశోర్‌రావు, నవీన్‌రాజ్, మీనా, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.