కామారెడ్డి : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భార్యను కత్తితో పొడవడంతో ఆమె మరణించిన ఘటన కామారెడ్డి ( Kamareddy ) పట్టణంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా సులభ్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న నర్సింలు (60) అనే వ్యక్తి డబ్బుల విషయంలో భార్య సంగీత (48)తో గొడవ పడ్డాడు. దీంతో ఆగ్రహించిన భర్త నర్సింలు కత్తితో ఆమె గొంతుకోసి అతడు అదే కత్తితో ( Knife ) కడుపులో పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ సంగీత అక్కడికక్కడే మృతి చెందగా భర్త నర్సింలును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.