ఈ తండాలో ఏ ఇంట్లో చూసినా.. జ్వరంతో బాధపడుతున్నవారే దర్శనమిస్తున్నారు. తీవ్రమైన జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులతో ప్రజలు అల్లాడుతున్నారు. వేల రూపాయలను ఖర్చు చేస్తూ ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. విషజ్వరాలతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తండాతోపాటు చుట్టు పక్కల తండాల వారు సైతం మంచంపడుతున్నారు.
– గాంధారి, ఆగస్టు 27
జ్వరంతోపాటు కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ప్రైవే టు వైద్యులను ఆశ్రయి స్తూ.. వేల ల్లో డబ్బు లు ఖర్చు చేసుకుంటున్నారు. అయినా రోజుల తరబడి వ్యాధి నయం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని ఆర్ఎంపీ, పీఎంపీలు జ్వరం తగ్గడం కోసం అధిక డోసు ఉన్న ఇంజెక్షన్లు ఇస్తున్నారని, దీంతో సైడ్ఎఫెక్ట్ బారిన పడే అవకాశం ఉన్నదని తండావాసు లు అంటున్నారు. ఇప్పటికైనా వై ద్యాధికారులు స్పందించాలని కో రుతున్నారు. సుమారు నాలుగు వేల జనాభా ఉన్న తండాలో పరిసరాలన్నీ కంపు కొడుతున్నాయి. ప్రత్యేకాధికారుల పాలన ఉండడంతో తండాల్లో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ కరువైంది.
వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న. ఒళ్లు, కీళ్ల నొప్పులు బాగా ఉన్నాయి. ప్రైవేటు దవాఖానలో చూపించుకున్నా. ఇంట్లో అందరూ జ్వరంతో బాధపడుతున్నరు. ఇప్పటికే వేల రూపాయలు ఖర్చయ్యాయి.
– మాలి నారాయణ, చద్మల్తండా
చద్మల్ తండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరంతో బాధపడుతున్న వారికి వైద్యసేవలందిస్తాం. సర్వే నిర్వహించి జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తాం. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
– సాయి కుమార్, డీడీవో, ఉత్తునూరు పీహెచ్సీ