Nizamabad | కంటేశ్వర్, జూన్ 15 : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవో) పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐపీఎస్యూ, డీఎస్ఎఫ్ఐ, విద్యార్థి సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ప్రజావాణి జరుగుతున్న సమయంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత రెండు నెలలుగా అనుమతి లేని పాఠశాలల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ, కేవలం పత్రిక ప్రకటనలకు మాత్రమే పరిమితమై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాల్సిన విద్యాశాఖ అధికారులే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో అనేక పాఠశాలలు అనుమతులు లేకుండానే అడ్మిషన్ ఫుల్ అంటూ బోర్డులు ఏర్పాటు చేసి విద్యార్థులను ఆకర్షిస్తున్నప్పటికీ, వాటిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డీఈవో కు వాస్తవాలను తెలియజేయకుండా కొందరు ఎం ఈ ఓ లు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
కావున అనుమతి లేని పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డిఇఓ సంబంధిత ఎంఈఓ లపై శాఖాపరమైన చర్యలు తీసుకొని వారిని విధుల నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
కలెక్టరేట్లో విద్యార్థి సంఘం నాయకులు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విద్యార్థి సంఘ నాయకులు నినాదాలు చేస్తూ అక్కడే ఉండడంతో అక్కడ ఉన్న పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకొని బలవంతంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు బతిమిలాడి బయటకు తీసుకువచ్చారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత పోలీసులు వచ్చి బయట కూర్చున్న సంఘ నాయకులను తీసుకొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ ఐ కార్యదర్శి విఘ్నేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, ఏఐపీఎస్ యు జిల్లా కార్యదర్శి బొడ.అనిల్, డి ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జీవన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సుబోధ్, ఏఐపీఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి గోపాల్ సింగ్ ఠాగూర్, నాయకులు కుశాల్, రాజు, చక్రి, సునీల్, శివ, వినీత్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.