కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో శాంతియుత నిరసనలకు తావు లేకుండా పోయింది. సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తే అవకాశమే లేకుండా ప్రభుత్వం నిర్బంధ కాండ విధించింది. ఖాకీలతో రాజ్యాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నది. డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన ఉద్యోగులు, ఉద్యమ సంఘాలపై లాఠీ ఎక్కుపెడుతున్నది. మొన్న శాంతియుతంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను ఈడ్చుకెళ్లిన ఉదంతం మరువక ముందే తాజాగా ఆశ వర్కర్లు, రైతు నాయకులను సోమవారం అక్రమంగా నిర్బంధించింది.
న్యాయం చేయమని అడిగేందుకు హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కామారెడ్డి బస్టాండ్‌లో నిల్చున్న ఆశ కార్యకర్తలను.. నేరస్తులను తరలించినట్లు పోలీసు జీపుల్లో తరలించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసనలు చేపట్టకుండా సర్కారు నిషేధం విధించింది. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజా పాలన అంటే ఇదేనా? అని ప్రశ్నిస్తున్నాయి.
కంఠేశ్వర్, మార్చి 24 : తమది ప్రజాపాలన అని గొప్పగా చెప్పుకుంటున్న కాం గ్రెస్ ప్రభుత్వం ప్రజల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నది. తమ సమస్యలను పరిష్కరించాలని చేపట్టే నిరసన కార్యక్రమాలపై నిషేధాజ్ఞలు విధిస్తున్నది. నిజామాబాద్ కలెక్టరేట్‌తోపాటు చుట్టుపక్కల ప్రాం తాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం నిషేధమని, ఒకవేళ ఎవరైనా నిరసన కార్యక్రమాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతాయని పోలీసులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం గమనార్హం.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 24: జగిత్యాల జిల్లా రైతు జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా నిజామాబాద్ జిల్లా రైతు నాయకులను పోలీసులు నిర్బంధించారు. అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రైతు జేఏసీ సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా జిల్లాలోని కమ్మర్పల్లి, వేల్పూర్, ముప్కాల్, ఆర్మూర్ మండలాల్లో రైతులోపాటు రైతునాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.