నిజామాబాద్ (ఖలీల్‌వాడీ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ వ్యక్తితో బిజినెస్మ్యాన్లు పోటీ పడుతున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి (MLC candidate) యాదగిరి శేఖర్‌రావు ( Yadagiri Shekar rao )అన్నారు. శనివారం నిజామాబాద్ ట్రస్మా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల (Teachers) సమస్యల పరిష్కారానికి ట్రస్మా అధ్యక్షుడిగా తనవంతు కృషి చేశానని పేర్కొన్నారు.
ఆపత్కాల సమయంలో రాష్ట్రంలోని 2న్నర లక్షల మంది ఉపాధ్యాయులకు రూ.2వేల చొప్పున అందించామని వెల్లడించారు. ప్రజల్లో మానవీయ విలువలను పెంపొందించడానికి స్థాపించిన ప్రజ్ఞా సంస్థకు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశానని ప్రజ్ఞా వికాస్, ఇతర సంస్థలతో కలిపి పట్టభద్రుల వృత్తి, నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించానని తెలిపారు. సంఘసంస్కర్తగా తాను చేస్తున్న సేవలను గుర్తించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనకు పట్టభద్రులు ఓటేసి గెలిపించాలని కోరారు.
పేద విద్యార్థులకు జూనియర్ , డిగ్రీ కాలేజీలలో ఉచితంగా అడ్మిషన్లను ఇప్పించానని తెలిపారు. కలమడుగు పాఠశాలను దత్తత తీసుకొని గత పది సంవత్సరాలుగా ప్రతి విద్యార్థినికి ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించానని వివరించారు. పాఠశాలకు త్రాగునీటి సదుపాయం కోసం ఆర్వో ప్లాంట్లను అందించానని పేర్కొన్నారు. విద్య హక్కు చట్టం ప్రకారం 25శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య కోసం కృషి చేస్తానని అన్నారు.
మోడల్ స్కూల్ టీచర్లకు జీవో 010 ద్వారా వేతనాలు అందజేసి, కారుణ్య నియామకాలు చేపట్టేలా కృషి చేస్తానన్నారు. 61 సంవత్సరాలు నిండిన ప్రైవేట్ ఉద్యోగికి జీవన భృతి ,పెన్షన్ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర కోశాధికారి జయ సింహా గౌడ్, జిల్లా అధ్యక్షులు నిత్యానందం, ప్రధాన కార్యదర్శి అరుణ్, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నరసింహారావు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జనార్దన్, నారా గౌడ్, పాఠశాల శ్రీనివాస్, నగేష్, పృథ్వి, తదితరులు పాల్గొన్నారు.