నిజామాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి జిల్లా ట్రెజరీ శాఖలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. ఉద్యోగుల్లో ఎట్టకేలకు చలనం వచ్చింది. డబ్బులు లేకుండానే ఎంప్లాయ్ ఐడీ, ప్రాన్ నంబర్లను రిలీజ్ చేస్తున్నారు. టేబుళ్లపై చేరిన కొత్త టీచర్లకు సంబంధించిన ఎంప్లాయ్ ఐడీ, ప్రాన్ నంబర్ల రిలీజ్ తంతులో వేగం పెరిగింది. పైసల కోసం ఆశ పడి రోజుల తరబడి పక్కకు నెట్టివేసిన ఫైళ్లకు క్లియరెన్సు లభిస్తున్నది.
కోశాధికారి కార్యాలయంలో గుట్టుగా చోటుచేసుకుంటున్న అక్రమాలను ‘నమస్తే తెలంగాణ’ కథనం రట్టు చేసింది. ఫైళ్లకు పైసలను ముడి పెట్టి నూతనంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరినీ వేధిస్తున్న తీరును ఎండగట్టింది. ఈ నెల 21న ‘ట్రెజరీలో దొంగలు’ శీర్షికన ప్రచురితమైన కథనంతో అక్రమార్కులు ఉలిక్కిపాటుకు గురయ్యారు. వందలాది మంది కొత్త టీచర్ల నుంచి భారీగా డబ్బులు దండుకునేందుకు వేసిన స్కెచ్ విఫలం కావడంతో ఒక్కసారిగా తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఈ విషయంపై కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సైతం దృష్టి సారించడంతో అక్రమార్కులు డబ్బుల మాటెత్తకుండా ప్రాన్ నంబర్లు, ఎంప్లాయ్ ఐడీని జారీ చేసేందుకు మొగ్గు చూపారు.
ట్రెజరీలో అక్రమాల్లో డిజిటల్ పేమెంట్స్ ఆసక్తికి గురి చేస్తోంది. కొంతమంది నగదు రూపంలో తీసుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. కొంత మంది ఉపాధ్యాయులకు ట్రెజరీలోని మహిళా ఉద్యోగినులు సైతం వేధింపులకు గురి చేసిన ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. వీరిలో కొంతమది ఏకంగా ఒక అడుగు ముందుకేసి ఫోన్‌పే, గూగుల్ పే నంబర్లు సైతం ఇచ్చారు. ఈ డిజిటల్ పేమెంట్‌లో కుటుంబీకుల ఫోన్ నంబర్లు ఇచ్చి పేమెంట్స్ చేయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భర్తలు, భార్యలు, కుమారుల నంబర్లకు ఫోన్‌పే, గూగుల్ పే చేసినట్లు తెలిసింది.
డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల్లో వచ్చే బ్యాంకు అకౌంట్లో ఖాతాదారుడి పేరుతో ఈ విషయం బహిర్గతమైంది. కొత్త టీచర్లకు ఎదురైన సమస్యపై టీపీటీఎఫ్ ఉద్యోగ సంఘం వినతి పత్రంతోపాటు ‘నమస్తే తెలంగాణ’ సంధించిన వార్తా కథనంతో ఒక్కసారిగా సంబంధీకుల్లో భయం పట్టుకున్నది. విద్యాశాఖకు సంబంధించిన వేధింపులే కాకుండా ట్రెజరీతో చెల్లింపుల వ్యవహారం ముడిపడి ఉన్న ప్రతి శాఖలోనూ వందలాది మంది బాధితులున్నారు. వేధింపులపై నిఘా పెడితే అక్రమార్కుల వ్యవహారాలు కోకొల్లలుగా బయటపడే అవకాశం ఉన్నదని బాధితులు చెబుతున్నారు. ట్రెజరీ దోపిడీపై ఉన్నత స్థాయిలో విచారణ చేయించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్‌ను కలెక్టరేట్లో పని చేసే ఉద్యోగులతోపాటు పోలీస్ శాఖకు చెందిన వారు కూడా కోరుతున్నారు. అవినీతి, నిర్లక్ష్యాన్ని సహించని కలెక్టర్ ఈ విషయంపై దృష్టి సారించాలని వేడుకుంటున్నారు.
ఉద్యోగులకు కష్టాలు వస్తే ఏమరపాటులో ఉద్యోగ సంఘాలు స్పందించాలి. వారికి మేమున్నామంటూ ముందుకు వచ్చి నిలబడాలి. ట్రెజరీ అక్రమాల వ్యవహారాల్లో ఉద్యోగ సంఘాల పాత్రపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఉద్యోగులను పీక్కుతింటున్న వ్యవహారం అందరికీ తెలిసినప్పటికీ నాయకులు మిన్నకుండి పోవడంపై సిబ్బంది మండిపడుతున్నారు. టీఎన్జీవో, టీజీవో, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన బాధ్యులంతా ఈ విషయంపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగ సంఘాల సమావేశాల్లో గొప్పలు మాట్లాడే నాయకులు ఈ విషయంపై మౌనం వహించడం ట్రెజరీ ఉద్యోగులకు సపోర్ట్ చేస్తున్నట్టే కదా? అని కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కామారెడ్డి ట్రెజరీకి ఏడీగా కొత్తగా వచ్చిన అధికారి ఈ విషయంపై లోతుగా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
ట్రెజరీ ఉన్నతాధికారికి మంచి పేరున్నప్పటికీ కింది స్థాయిలో సంఘాల పేరుతో ఒకరు, విచ్చలవిడితనంతో మరికొందరు ఇలా దోపిడీకి పాల్పడుతుండడంతో శాఖకు చెడ్డ పేరు వస్తున్నదని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు.