కామారెడ్డి, ఏప్రిల్ 26 : నాన్వెజ్ వండలేదని ప్రశ్నించినందుకు భర్తను క్షిణికావేశంలో భార్య హతమార్చింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గోసంగి కాలనీలో శివాజీ- లక్ష్మి దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి భార్య భర్త చిన్నపాటి గొడవ పడ్డారు.
ఈ క్రమంలో తనకు నాన్వెజ్ ఎందుకు వండలేదని భార్యను ప్రశ్నించగా క్షణికావేశంలో ఆమె కొడవలితో శివాజీ మెడ పై దాడి చేసింది. ఈ దాడిలో శివాజీ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృత దేహాన్ని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. భార్య లక్ష్మిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు. తండ్రి మృతి చెందడం, తల్లి జైలు పాలు కావడంతో పిల్లలు అనాథలుగా మారారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.