Vemulavada | వేములవాడ, జూలై 22 : కోడిగుడ్లతో కూర బగారా అన్నం వండుకొని మరి కడుపునిండా తిని దొంగతనానికి పాల్పడిన సంఘటన వేములవాడ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. ఆషాఢ మాసం కావడంతో భక్తుల రద్దీ అంతంత గానే ఉండగా జాతర గ్రౌండ్ లో పలు దుకాణాలు దాదాపు మూసివేసే ఉంటున్నాయి. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు జాతర గ్రౌండ్ లోని గాజుల దుకాణాలు, బొమ్మలు, వంట సామాగ్రి అద్దెకిచ్చే దుకాణాలే లక్ష్యంగా 10 దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు.
అయితే వంట సామాగ్రి అద్దెకిచ్చే దుకాణంలోకి చొరబడిన దొంగలు దర్జాగా కోడిగుడ్ల కూరతో బగారా అన్నం వండుకొని పల్పి ఆరెంజ్, హ్యాపీ పిజ్జా ఇలాంటి శీతల పానీయాలను తీసుకొని మరి కడుపునిండా భోజనం చేసి దొంగతనానికి పాల్పడ్డారు. ఇలా పది దుకాణాల్లో సుమారు రూ.మూడు లక్షల విలవ గల వస్తువులతో పాటు దాదాపు రూ.30 వేల నగదును చోరీ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. అయితే దర్జాగా వండుకొని మరీ కడుపునిండా తిన్న ఆహార పదార్థాలను చూసి పోలీసులు నివ్వర పోయారు.