బోధన్, మార్చి 13: సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో వందేండ్లకు పైగా ఆనవాయితీగా జరుపుకొంటున్న పిడిగుద్దులాటపై పోలీసులు ఆంక్షలు విధించారు. గ్రామస్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ సాంప్రదాయంపై రాష్ట్ర సర్కార్ ‘పిడుగు’ పడింది. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా సాయంత్రం జరగాల్సిన ఈ ఆటను ఆడనివ్వబోమని ప్రభుత్వం హుకూం జారీచేసింది. దీంతో ‘పిడిగుద్దులాట’ నిర్వహించకూడదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు.
ఈ ఆటఆడడం చట్టవిరుద్ధమని, గ్రామంలో హోలీ రోజున 144 సెక్షన్ ఉంటుందంటూ పోలీసులు గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. శుక్రవారం జరిగే ‘పిడిగుద్దులాట’ నిర్వహిస్తే.. చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ గ్రామంలోని 15 మంది గ్రామపెద్దలు, కులపెద్దలకు పోలీసులు నోటీసులు జారీచేశారు. పోలీసుల చర్యతో గ్రామస్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వందేండ్లకుపైగా తమ గ్రామంలో పిడిగుద్దులాట జరుగుతున్నదని, ఎన్నడూ లేనివిధంగా ఆంక్షలు ఏంటని ప్రభుత్వ చర్యపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తమ సాంప్రదాయంపై వేటు వేయడానికి మీరెవరంటూ యువకులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. గ్రామంలో ఆడి తీరాల్సిందేనంటూ గ్రామస్తులు పట్టుబడుతున్నారు. గతంలో తమ ఆటపై ఇటువంటి ఆంక్షలు ఉండేవికావని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు చెప్పేవారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు మాత్రం తాము ఏదో ఘోరానికి పాల్పడుతున్నామా అన్నట్లు ప్రవర్తించడం సరికాదంటున్నారు. అయితే పిడిగుద్దులాటను చూసేందుకు ఆ ఊరి ఆడబిడ్డలు, అల్లుళ్లు, బంధువులు ఇప్పటికే గ్రామానికి చేరుకున్నారు. ఒకపక్క పోలీసుల ఆంక్షలు, మరోపక్క గ్రామస్తుల మొండిపట్టు మధ్య శుక్రవారం జరిగే పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
వందేండ్లకు పైనుంచే మా గ్రామంలో పిడిగుద్దులాట ఉన్నది. మా ఊరి ప్రత్యేకతగా ఈ ఆట గురించి గొప్పగా చెప్పుకుంటాం.. ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఆట ఆడవద్దంటూ పోలీసులు మా గ్రామపెద్దలకు నోటీసులు ఇవ్వడం శోచనీయం. ఈ ఆట వల్ల ఇప్పటివరకూ ఎవరికీ ఎటువంటి నష్టం, గొడవలు జరగలేదు. పిడిగుద్దులాట విషయంపై గ్రామస్తులందరం ఒకే మాటగా ఉంటాం. పోలీసులు హోలీ రోజున ఈ ఆటను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని మనవి.
– జక్క నాగరాజు, హున్సా
పిడిగుద్దులాటను మా గ్రామంలో ఎంతో పవిత్రంగా భావిస్తాం. తాత, ముత్తాతల నుంచి ఈ ఆటను ఆడుతున్నారు. ఇప్పడు సడెన్‌గా ఈ ఆట ఆడవద్దంటే ఆడకుండా ఉండలేం. ఒకవేళ ఆట ఆడకపోతే ఊరికి అరిష్టం జరుగుతుందన్న నమ్మకం ఉంది. మా ఆచారం, సాంప్రదాయాన్ని పోలీసులు అర్థంచేసుకోవాలి.
– ఆనంద్‌రావు, హున్సా