కోటగిరి, జూన్ 17 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప, సాయిబాబా దేవాలయాల్లో బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఆలయంలోకి చొరబడి రెండు హుండీలను చోరీ చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. కోటగిరిలోని శ్రీ అయ్యప్ప, సాయిబాబా దేవాలయంలో బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ముఖానికి నల్లని ముసుగు ధరించి ఆలయంలోకి చొరబడ్డారు. దేవాలయంలోని గర్భగుడి తాళాలు పగలగొట్టి, గర్భగుడిలో ఉన్న రెండు హుండీలను తీసుకొని పరారయ్యారు.
దేవాలయం పక్కనే ఉన్న కాలువలో హుండీల తాళాలు పగల కొట్టి డబ్బులను తీసుకువెళ్లారు. హుండీలను అక్కడే కాలువలో పడేశారు. దేవాలయానికి సంబంధించిన తాళాలను వ్యవసాయ పొలాల్లో అక్కడక్కడ పడేశారు. దేవాలయం కమిటీ సెక్రటరీ నిశాంత్ ఫిర్యాదు మేరకు క్లూస్ టీంను రంగంలోకి దించి వివరాలను సేకరిస్తున్నామని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామన్నారు. హుండీలనుంచి సుమారుగా రూ.40 వేలకు పైగా ఉండవచ్చని చెప్పారు.