గాంధారి, డిసెంబర్ 7 : మానవత్వం మంట గలుస్తోంది. రోజురోజుకూ మనిషి తన స్వభావాన్ని కోల్పోతున్నాడేమో అనిపిస్తోంది. అప్పుడే పుట్టిన శిశువులను రోడ్డుపై వదిలేస్తూ కర్కశత్వాన్ని చాటుకుంటున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను రోడ్డుపాలు చేస్తున్నారు. గాంధారి మండలంలోని పిస్కిల్గుట్ట సమీపంలో అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రోడ్డుపక్కన వదిలి వెళ్లినట్లు స్థానిక ఎస్సై రాజేశ్ తెలిపారు.
ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పిస్కిల్గుట్ట తండాకు వెళ్లే దారికి పక్కన బుధవారం ఉదయం శిశువు ఏడుపు వినిపించడంతో అటుగా వెళ్తున్న తండా వాసు లు గుర్తించారు. శిశువును తీసుకెళ్లి శుభ్రం చేశారు. అనంతరం పోలీసులు, మాతాశిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకొని శిశువును స్వాధీనం చేసుకొన్నారు. వైద్య పరీక్షల కోసం దవాఖానకు తరలించారు.ఈ విషయమై తిమ్మాపూర్ సర్పంచ్ శోభా పరమేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.